ఆయనో ట్రెండ్ సెట్టర్. లెజండ్రీ డైరెక్టర్… ఎంతోమందికి స్పూర్తి. తెలుగు సినిమాను కమర్షియల్‌గా నిలిపి… 70 ఎంఎం తెరపై తిరుగులేని దర్శకుడుగా నిలిచిన ఘనత కోవెలమూడి రాఘవేంద్రరావు బీ.ఏకు మాత్రమే దక్కుతుంది. అసలు బీఏ అనే డిగ్రీ క్వాలిఫికేషన్‌కు అంత గౌరవం వచ్చేందుకు కారణం కూడా ఆయనేనేమో. అప్పట్లో డిగ్రీ అంటే బీఏ.. పట్టా సాధించటం కుటుంబానికే కాదు.. ఆ ఊరికి కూడా గొప్ప. సినిమా అంటేనే.. అదో రంగుల లోకం.. అనైతిక కార్యకలాపాలకు చిరునామా అనుకునే సమయం.
కానీ అక్కడ కూడా విలువలు.. విద్యావంతులు ఉన్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఉంటారని చూపేందుకు రాఘవేంద్రరావు తన పేరు పక్కన డిగ్రీను చేర్చేవారని చెబుతుండేవారు. ఎన్ని సినిమాలు తీశారనేది పక్కనబెడితే ఎంతమందికి స్టార్‌డమ్ తీసుకొచ్చారనేది చాలా ముఖ్యం.. నందమూరి తారకరామారావు.. పౌరాణిక చిత్రాలతో దూసుకెళ్లే సమయంలో అడవిరాముడుతో సాంఘికచిత్రాల్లో తిరుగులేని హీరోను చేశారు. తొలి సినిమా బాబుతో మొదలైన ప్రస్థానంలో కృష్ణ, శోభన్‌బాబు, అక్కినేని, చిరంజీవి వెంకటేష్, నాగార్జున ఇలా చెప్పుకుంటూ పోతే.. తండ్రులు, వారసులను డైరెక్ట్ చేసిన ఘనత రాఘవేంద్రరావుకే దక్కుతుంది. గడ్డం, తలపై టోపి,మౌనానికి కేరాఫ్ చిరునామాగా కనిపించే ఆయనకు కోపం కూడా ఎక్కువేనట. కానీ దాన్ని ఎవరిపై ప్రయోగించకుండా కళ్లజోడు పగులగొట్టేవారనే పేరుంది. తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాలు తీసి బ్లాక్‌బ్లస్టర్లు కొట్టారు. చిరంజీవిని ముద్దుగా బాబాయి అంటూ పిలిచే చనువుంది. చిరంజీవి కూడా తనకు మెగాస్టార్ స్థాయికి రావటానికి రాఘవేంద్రుడితో తీసిన అడవిదొంగ తొలిమెట్టుగా చెబుతుంటారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి తో రికార్డులు బద్దలు కొట్టారు. దగ్గుబాటి వెంకటేష్ నుంచి అల్లు అర్జున్, మహేష్‌బాబు వంటి వారిని వెండితెరకు పరిచయం చేసి స్టార్‌డమ్‌లకు పునాది వేశారు.