బంగారుబుల్లోడు సినిమా గుర్తుందా.. బాలయ్య నటించిన ఎవర్‌గ్రీన్ హిట్ మూవీ. అందులో రమ్యకృష్ణతో పోటీపడుతూ మరో భామ మెప్పించింది. ఆమే.. రవీనాటాండన్. వానపాటలో ఆమె నృత్యం ఔరా అనిపించలేదూ! 1974 అక్టోబరు 26 అంటే ఈ రోజు ఆమె పుట్టినరోజు. ముంబైకు చెందిన రవీనాటాండన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నట సినిమాల్లో మెప్పించారు. పత్తర్ కే పూల్ ద్వారా 1991లో తొలిసారి వెండితెరపై జిగేల్ అనిపించారు. మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత ఖిలాడియోంకా ఖిలాడీ, మొహ్రా, అనారీ, జడ్జి వంటి పలు సినిమాల్లో కనిపించారు. తెలుగులో బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో, రథసారథి.. కొన్నేళ్ల క్రితం వచ్చిన పాండువులు పాండువులు తుమ్మెదలో నటించారు. 2004లో అనిల్ ధడానీను పెళ్లి చేసుకున్నారు. వారికి రఫా, రణబీర్ ఇద్దరు పిల్లలు. తెలుగు సినిమాకు రవిరాజా పినిశెట్టి పరిచయం చేశారు. బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా నిప్పురవ్వ, బంగారుబుల్లోడు రెండూ ఒకే రోజు రిలీజయ్యాయి. ఎన్నో అంచనాలున్న నిప్పురవ్వ బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.. బంగారుబుల్లోడు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ 2లో రవీనా లుక్‌తో ఉన్న పోస్టర్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో రవీనాటాండన్ కీలక పాత్ర పోషించనున్నారు. కేజీఎఫ్2 చిత్రయూనిట్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.