రేవంతుడికి ప‌గ్గాలు.. ఇక ర‌చ్చ‌ర‌చ్చేనా!

రేవంత్‌రెడ్డి యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న లీడ‌ర్‌. కొడంగ‌ల్‌లో ఓడినా మ‌రో ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా మ‌ల్కాజిగిరి ఎంపీ అయ్యారు. ఇదంతా రాత్రికి రాత్రో.. లేక‌పోతే ల‌క్ వ‌ల్ల‌నే కుదిరింది కాదు. ఏళ్ల‌త‌ర‌బ‌డి చేసిన యుద్ధం. టీడీపీలో రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకున్న రేవంత్‌రెడ్డి.. అలియాస్ రేవంత‌న్న‌కు ఎంత క్రేజ్ ఉందో అదేస్థాయిలో కాస్తో కూస్తో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లేక‌పోలేదు. నోటుకు ఓటు కేసులో ఏసీబీకు అడ్డంగా చిక్కినా ఆయ‌న‌పై అభిమానుల్లో ప్రేమ త‌గ్గ‌లేదు. జైలు నుంచి విడుద‌లైన రోజున‌.. ఒక సీఎంకు ఉన్నంత ఇమేజ్ స్థాయిలో జ‌నం వ‌చ్చారంటే అర్ధం చేసుకోవ‌చ్చు. ప‌దేళ్లుగా క‌ష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌ను గ‌ట్టెక్కించి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు బాహుబ‌లి అవ‌స‌రం అంటూ పెద్ద‌లు జానారెడ్డి ఆనాడు సెల‌విచ్చారు. ఆ బాహుబ‌లి రేవంత్‌రెడ్డి అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అన్న‌ట్టుగా రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో హ‌స్తం తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎంపీగా మంచి మెజార్టీతో గెల‌వ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ హ‌వా స‌మ‌యంలో ఘ‌న విజ‌యం సాధించి కాంగ్రెస్‌కు స‌రైన నేత రేవంత్ అనేలా అదిష్ఠానం గుర్తించేలా చేశారు. దాదాపు రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేదానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నాయ‌క‌త్వంపై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మొద‌ట్నుంచీ వ్య‌తిరేకంగా ఉంటున్నారు.

కాంగ్రెస్ ప‌గ్గాలు త‌మ చేతికిస్తే.. తెలంగాణ‌లో గెలిచి చూపుతామంట కోమ‌టి బ్ర‌ద‌ర్స్ స‌వాల్ విసిరారు. వీహెచ్‌, భ‌ట్టివిక్ర‌మార్క‌, జీవ‌న్‌రెడ్డి, గీతారెడ్డి త‌దిర సీనియ‌ర్లు కూడా పీసీపీ ప‌ద‌వి కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ.. వీరంద‌ర్నీ కాద‌ని.. రేవంత్‌కు ప‌గ్గాలిచ్చారు. రేవంత్ కూడా రాజ‌కీయాల‌ను రాజ‌కీయాల‌తోనే నెగ్గాల‌నే రీతిలో త‌న‌ను వ్య‌తిరేకించే వ‌ర్గంతో మంత‌నాలు మొద‌లుపెట్టారు. తాను చిన్న‌వాడినంటూ.. పెద్ద‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే న‌డ‌చుకుంటానంటూ వారి ఆశీస్సులు కోరుతున్నారు. రేవంత్ రాక‌తో కాంగ్రెస్‌కు దూర‌మైన విశ్వేశ్వ‌ర్‌రెడ్డి వంటి నేత‌లు తిరిగి వ‌స్తార‌నేది హ‌స్తం నేత‌ల ఆలోచ‌న‌. యూత్‌లో కూడా మంచి ఇమేజ్ పెరుగుతోంది. టీఆర్ ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న స‌మ‌యంలో బ్రేక్ వేయ‌టంలో రేవంత్‌రెడ్డి ప్లానింగ్ వ‌ర్క‌వుట్ అవ‌తుంద‌నే అంద‌రూ భావిస్తున్నారు. టీఆర్ ఎస్‌ను వీడే నేత‌లు.. మొద‌టి ఛాయిస్‌
బీజేపీగా చూస్తూ వ‌చ్చారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంపై ఉన్న న‌మ్మ‌కంతో హ‌స్తం కండువా క‌ప్పుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌నేది తెలుస్తోంది. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి ఇక నుంచి మీడియా స‌పోర్టు కూడా పెరిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎటుచూసినా రేవంత్‌రెడ్డి టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడుగా ఎంపిక కావ‌టం కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.

1 COMMENT

  1. పుచ్చిపోయాకా రచ్చ అయినా..
    తొక్కుడు కచ్చా అయినా ఒకటే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here