పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా. మూడేళ్లుగా ఉత్తమ్‌ను తప్పించాలంటూ తెర వెనుక చక్రం తిప్పిన హస్తం నేతలు ఖుషీ అయ్యారు. ముఖ్యంగా కో్మటిరెడ్డి బ్రదర్స్‌కు ఇది అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు. 2014, 2018 వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ అవమానం మూటగట్టుకుంది. ఇదంతా ఎవరో చేసిన తప్పిదమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకు బయటి శత్రువులతో ప్రమాదం ఉండదు.. సొంత వాళ్లతోనే పాతాళానికి వెళ్తుంది అంటూ హస్తం సీనియర్లు సరదాగా కామెంట్స్ చేస్తుంటారు. నిజమే.. కాంగ్రెస్‌లో నేతలు చాలామంది ఉంటారు. అందరూ పదవి కోరుకుంటారు. తమను కాదని ఎవరికి పదవులు కట్టబెట్టినా వెన్నంటే ఉండి దెబ్బతీయాలని చూస్తుంటారు. వందేళ్ల చరిత్ర గల పార్టీ ఇప్పుడు నాయకత్వ కొరత జాతీయస్థాయిలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. ఏపీలో దాదాపు పార్టీ ఖాళీ అయిందనే భావన అక్కడి నెలకొంది. మిగిలింది.. తెలంగాణ.. ఇక్కడ ఏకంగా అధికారం సంపాదించాలనే ఎత్తుగడతో పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ ఎస్ కు ధీటుగా నిలబడింది. కానీ.. అనుకోని పొత్తుగా టీడీపీ చేరటంతో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పలేదు. ఏపీను బూచిగా చూపుతూ.. కేసీఆర్ ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి గెలుపు సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు నేత ఎవరంటే..చాలామంది మేమేనంటున్నారు. వారిలో వీహెచ్ హనుమంతురావు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి ఇలా చాంతాడంత జాబితా కనిపిస్తుంది. దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డికి పగ్గాలు అప్పగించటం ద్వారా కేసీఆర్, బండి సంజయ్ వంటి వాళ్లకు ధీటుగా కాంగ్రెస్‌ను నడపించవచ్చనే భావన కాంగ్రెస్ అదిష్ఠానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ.. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన నేత కావటంతో.. కాంగ్రెస్ సీనియర్లు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌లో బాహుబలి రేవంత్‌రెడ్డి అంటూ గతంలో జానారెడ్డి అన్నపుడే అలకబూనారు. ఇప్పుడు.. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం అప్పగిస్తే సీనియర్లు ఎంత వరకూ ఓకే అంటారనే ఆందోళన లేకపోలేదు. అందర్నీ ఒప్పించి రేవంత్‌డికి పగ్గాలు ఎలా అప్పగించాలనేది హైకమాండ్‌కు సవాల్‌గా మారింది.