రియా జాబితాలో ఖాన్‌లు.. క‌పూర్‌లు ఎంద‌రో!

బాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌. స‌ల్మాన్‌ఖాన్ జింక‌ల‌ను కాల్చిన‌పుడు.. సంజ‌య్‌ద‌త్ వ‌ద్ద ఏకే47 దొరికిన‌పుడు.. షారూక్‌ఖాన్‌కు విమానాశ్ర‌యంలో అవ‌మానం జ‌రిగిన‌‌పుడు కూడా ఇంత‌టి ఉత్కంఠ‌త లేద‌ట‌. సుశాంత్‌సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో ఎన్నో చీక‌టికోణాలు.. వృద్ధాప్యంలో రోమియోలుగా చెలామ‌ణీ అయ్యే భ‌ట్‌ల గుట్టు బ‌ట్ట‌బ‌య‌లైంది. అస‌లు సుశాంత్‌సింగ్ అనే బుల్లితెర న‌టుడు.. బాలీవుడ్‌కు రావ‌టం క‌ష్టం. అదేమిటీ.. షారుక్ వ‌చ్చాడుగా అనుకోవ‌చ్చు. ఆయ‌నంటే ఖాన్‌.. గాడ్ ఫాద‌ర్ ఉండొచ్చు. కానీ సుశాంత్‌సింగ్ మాత్రం అలా కాదు.. వ‌చ్చాడు. గెలిచాడు.. ఎవ‌రికో న‌చ్చ‌క లోకం వ‌ద‌లి వెళ్లిపోయాడు. ఓ దివ్య‌భార‌తి ఆత్మ‌హ‌త్య‌లాగానే ఇది కూడా కాలంలో క‌ల‌సి పోతుంద‌నుకున్నారు. కానీ.. కంగ‌నా వంటి ఫైర్‌బ్రాండ్‌లు ఉంటార‌ని ఊహించ‌లేక‌పోయి ఉంటారు. మొద‌ట్లో సుశాంత్ మ‌ర‌ణంపై కంగ‌నా స్పందిస్తే బాలీవుడ్ ఇండ‌స్ట్రీ విస్తుపోయింది. కానీ.. ఏదో ఉండే ఉంటుంద‌నే అనుమానంతో తీగ‌లాగారు.. బిహార్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప‌రువు పొగొట్టుకునేంత వ‌ర‌కూ చేరాయి. ఈ స‌మ‌యంలోనే కోర్టుల పుణ్య‌మాంటూ కేసు సీబీఐకు బ‌దిలీ అయింది. ఇక వారి చేతికి కేసు చిక్కితే అంతే సంగ‌తులు.. తొక్కిప‌ట్టి నార‌తీస్తారంటారే! అంతే సంగ‌తులు.. ఎన్ని ఉద్దండ పిండాల‌ను జైల్లో ఉంచి చిప్ప‌కూడు తినిపించార‌నేది మ‌న తెలుగోళ్ల‌కు కూడా బాగా తెలిసిందే. అదే జాబితాలో ఇప్పుడు సుశాంత్‌సింగ్ మ‌ర‌ణం వెనుక దాగిన వాస్త‌వాల‌ను కూపీ లాగారు.. అస‌లు పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేల్చారు? అనే విష‌యం వ‌ద్ద సీబీఐ కూపీ లాగితే.. డొంక క‌దిలింది. అస‌లు సుశాంత్ ఎలా చ‌నిపోయాడ‌నేది ఇప్ప‌టికీ ప్ర‌శ్న‌గానే మారింది. పోస్టుమార్టం చేసిన వైద్యులు, సుశాంత్ కుంగుబాటుతో మందులు వాడాడ‌నే విష‌యంపై క్లారిటీ వచ్చింది. ఇదంతా ఎవరు ఆడించిన నాట‌కం అన్న‌పుడు.. మాజీ ప్రియురాళ్ల జాబితాలో రియాచ‌క్ర‌వర్తి బ‌య‌టకు వ‌చ్చింది. అస‌లు.. నేను చాలా మంచిదాన్ని.. సుశాంత్‌సింగ్‌తో కొద్దిరోజ‌లు గ‌డుపుదామ‌ని విదేశాల‌కు వెళితే అక్క‌డా మూడీగానే గ‌దిలో ఉన్నాడంటూ క‌ల్ల‌బొల్లి మాట‌ల‌తో సీబీఐను ఏమార్చాల‌నే ప్ర‌య‌త్నం బెడ‌సికొట్టింది. రియా.. ఒట్టి అమాయ‌కురాల‌ని న‌మ్ముతార‌ని అంద‌రూ భావించినా.. చివ‌ర‌కు సుశాంత్ సింగ్‌కు మ‌త్తు మందు అల‌వాటు చేసింది తానే అని ఒప్పుకుంది. అంతేనా.. తాను కూడా మ‌త్తులో ఊగేదాన్నంటూ అంగీక‌రించింది. అంత‌టితో ఆగితే.. క‌థ‌లో రంజు ఏముంటుంది.. నేనే కాదు.. నా వెనుక‌.. ఇదిగో 25 మంది పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా డ్ర‌గ్స్ రుచి మ‌రిగారంటూ పూస‌గుచ్చిన‌ట్టు సీబీఐ కు చెప్పేసింద‌ట‌. ఇప్పుడు.. ఆ 25 మందిలో ఎవ‌రున్నారు? వీరిలో ఖాన్‌లు ఎంద‌రు.. క‌పూర్‌లు ఎంత‌మంది.. భ‌ట్‌లున్నారా.. ద‌త్‌లు కూడా చేరారా! ఇదంతా చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ట‌. ఒక‌వేళ పేద్ద హీరోల పేర్లు ఉన్న‌ట్టు బ‌య‌ట‌కు వచ్చి.. క‌మాన్ అంటూ సీబీఐ విచార‌ణ‌కు పిలిస్తే.. తెలుగు న‌టుల్లో చాలామందిలో వ‌ణ‌కు పుడుతుంద‌ట‌. ఎందుకంటారా! అది మ‌రో ఎపిసోడ్‌లో చ‌ద‌వాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here