ఏ దివిలో విరిసిన పారిజాతమోనంటూ.. ముగ్దల మనసు దోచాడు. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినమంటూ భగ్నప్రేమికుల బాధను చెప్పాడు. తరలిరాదా తనే వసంతం అంటూ సమాజాన్ని మేలు కొలిపాడు. అంతర్యామి అలసితిని అంటూ.. భువి నుంచి దివికి చేరారు గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రియులు ముద్దుగా పిలుచుకునే బాలు. తెలుగు భాషకు ఆయన స్వరం గొప్ప వరం. ఘంటసాల వెంకటేశ్వరావు తరువాత అంతగా తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు పరిచయం చేసిన గొప్ప కళాకారుడు. పాటతోనే కాదు.. ప్రేమికుడు సినిమాలో అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అంటూ.. డ్యాన్స్‌తో కూడా వావ్ అనిపించారు. అంతేనా.. పాడుతాతీయగా అంటూ.. ఎంతమంది గాయనీ, గాయకులను ప్రపంచానికి పరిచయం చేసి ఉంటారు. 74 ఏళ్ల వయసులోనూ అదే వేగం.. అదే క్రమశిక్షణ. కానీ.. కరోనా వాకిట 51 రోజులు పోరాటం చేశాడు. గంధర్వలోకంలో పాటకచేరీ ఉందని వెళ్లిపోయారు.
ఆయన చెప్పే మాటలు కాస్త కటవుగా అనిపించినా దాని వెనుక వాస్తవాలుంటాయి. అందరూ సంగీత పోటీల్లో బాలు తిడతారు.. లోపాలు ఎత్తిచూపుతారనుకుంటారు. కానీ.. అక్కడే పిల్లలకు తప్పొప్పులు చెప్పి.. వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించే అసలు సిసలైన గురువు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉండగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆ నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, మోహన్‌బాబు, చిరంజీవి ఇలా ఎంతోమంది స్టెప్పులకు.. తన గాత్రంతో ప్రాణం పోసేవారు. నిజంగానే ఆ హీరోలే పాట పాడుతున్నారా! అనేంతగా అచ్చు హీరోల గొంతుకు తగినట్టుగా పాటలతో అలరించే గొప్పతనం బాలు ప్రత్యేకం.
ఇక్కడ మరో విషయం చెప్పాలి.. తాను పాడిన పాటలక నిజమైన న్యాయం చేయగల హీరోలు ఇద్దరు మాత్రమేనంటూ పలుమార్లు బహిరంగ వేదికల మీదనే చెప్పేశారు. వారిలో ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు. మరొకరు మెగాస్టార్ చిరంజీవి.. తన పాటకు సరైన స్టెప్పులు, డ్యాన్స్‌లతో న్యాయం చేసేవారు ఆ ఇద్దరే అనేవారు. సూపర్‌స్టార్ కృష్ణతో కూడా పలుమార్లు గొడవ పడిన సందర్భాలున్నాయి. అయినా అవన్నీ టీ కప్పులో తుపానుగా వచ్చిపోతుండేవి. కాబట్టే.. 16 భాషల్లో 40,000 పాటలు పాడగలిగారు. ప్రపంచ రికార్డులు.. ఫిలింఫేర్ పురస్కారాలను అందుకోగలిగారు. 20కు నంది పురస్కారాలు ఆయన పాటకు.. నటనకు గుర్తుగా ఇంట్లోకి చేరాయి.
ఎన్ని భాషలు పాటలు పాడినా.. తెలుగు అంటే ప్రాణం. నెల్లూరులో పుట్టి పెరిగిన బాలసుబ్రహ్మణ్యం. తన పాటతో అందరివాడుగా ఎదిగారు. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనెటమ్మ కోటలో పుట్టారు. అమ్మ శకుంతలమ్మ, నాన్న సాంబమూర్తి. వాస్తవానికి బాలుకు ఇంజనీరింగ్ కావాలని ఉండేది.. పాటలంటే అంతే భావన ఉండేది. కానీ.. తండ్రి సాంబమూర్తి మాత్రం.. రెండు పడవలపై ప్రయాణం వద్దని వారించారు. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుని అక్కడే తనను తాను నిరూపించుకోమని చెప్పారు. అలా.. ఇంజనీర్ కావాల్సిన బాలు గాయకుడుగా మారారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గాత్రంతో 1966లో అలనాటి నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో తొలిసారి తన గానాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రేమికుడు, దొంగదొంగ, సత్యభామనే వంటి ఎన్నో సినిమాల్లోనూ నటించారు. మిధునంలో ఆయన నటనకు నంది పురస్కారం 2012లో వరించింది. రఘువరన్, కమల్‌హాసన్, నగేష్ ఇలా ఎంతోమంది నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈటీవీలో పాడుతాతీయగా ద్వారా రెండుదశాబ్దాల్లో వందలాది మంది గాయకులను వెండితెరకు పరిచయం చేశారు.
కరోనా నేపథ్యంలో చెన్నైకే పరిమితమయ్యారు. ఇటీవల ఆంక్షలు సడలించటంతో పాడుతాతీయగా, సామజవరగమన వంటి కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తున్నారు. గంటల తరబడి ప్రయాణంలోనూ అలసిపోలేదు. కానీ.. ఒకరోజు పాటల పోటీ నుంచి ఇంటికెళ్లాక కాస్త ఒళ్లునొప్పులు, నీరసం అనిపించటంతో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అలా హైదరాబాద్‌లో ఉన్నపుడు కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్‌లో అగస్టు 4న చేరారు. తాను బాగానే ఉన్నట్టు సెల్ఫీ వీడియోతో అభిమానులకు సమాచారం పంపారు. అందరూ ఆయన కోలుకుంటారనే భావించారు. కరోనా నెగిటివ్ వచ్చింది. ఫిజియోథెరపీ ద్వారా రోజూ 20 నిమిషాలు కూర్చుంటున్నట్టు తనయుడు చరణ్ కూడా ఆనందంగా చెప్పారు. కానీ.. రెండ్రోజుల క్రితం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటంతో మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్న 1.04 గంటలకు పరమపదించారంటూ తనయుడు చరణ్ ప్రకటించారు. తన కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన అభిమానులు. సినీ ప్రపంచం దుఃఖసాగరంలో మునిగిపోయింది. గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులు బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. బాలుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నెల్లూరు గురించి పాటకట్టి పాడతానంటూ మాటిచ్చిన బాలు.. మాట నెరవేర్చుకుంటారని భావించానంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెమరవేసుకున్నారు.