శ్రావణి.. ఎంత అందమైన అమ్మాయి. ఇంకెంత మంచి మనసు. తప్పొప్పులు తెలియని వయసులో సినీరంగానికి వచ్చింది. తన సౌందర్యం.. అభినయం మాత్రమే సినిమాకు అవసరమనుకుంది. కానీ.. అంతకుమించి తన శరీరాన్ని కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుందనే సంగతి గ్రహించి ఉండదు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో.. బుట్టబొమ్మలా ఉన్నావంటూ పొగిడితే మురిసిపోయింది. అలా ఆకాశానికి ఎత్తేసే కళ్ల వెనుక కైపును పసిగట్టలేకపోయింది. ఆ తరువాత క్రమంగా అలవాటుపడింది.. మనసే రాయిగా మారినపుడు.. ఇక ఈ శరీరంతో పనేముందనుకుని ఉంటుంది.. ఇటు కుటుంబాన్ని పోషించాలనే ఆలోచనతో తప్పులను అంచనా వేయటం మరచిపోయింది. జిగేల్ మంటూ కనిపించే వెలుగుల చాటున.. చీకటి జీవితానికి అలవాటు పడిపోయింది.
టీవీనటి కొండపల్లి శ్రావణి మరణానికి దేవరాజ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, సాయి కృష్ణారెడ్డి కారణమంటూ పోలీసులు తేల్చారు. ఎనిమిదేళ్లుగా.. తాను పడిన నరకాన్ని.. ఆడపిల్లగా ఎటూ తేల్చుకోలేక బేలగా మిగిలిన పరిస్థితిని కూడా పోలీసులు గుర్తించారు. ముగ్గురు మగాళ్లు.. పరిచయమయ్యాక.. ఆమె ఎవరితో ఉండాలో తేల్చుకోలేకపోయింది. మొదట.. సాయికృష్ణారెడ్డి అనే వాడు.. ప్రేమ, పెళ్లి అంటూనే అవసరాలు తీర్చుకున్నాడు. పెళ్లంటే ముఖం చాటేశాడు. ఆ తరువాత.. అశోక్‌రెడ్డి తాను కూడా అంతే.. అప్పటికే పెళ్లయింది. కానీ..ఆ అవసరాలకు ఒకరు కావాలి.. అండదండ లేని శ్రావణికి వలవిసిరాడు. తన వద్ద ఉన్న డబ్బుతో ఇంట్లో వాళ్లను ఆకట్టుకున్నాడు.
అక్కడా శ్రావణి తప్పచేసింది. ఆ తరువాత దేవరాజ్‌రెడ్డి.. ఇక్కడ మాత్రం శ్రావణి మానసికంగా సిద్ధమైంది. తప్పులన్నీ పక్కనబెట్టి దేవరాజ్‌తో కొత్త జీవితం కోరుకుంది. అందుకే.. తన కష్టపడి కూడబెట్టిన డబ్బును ఇచ్చేసింది. అతడిని పూర్తిగా నమ్మేసింది. కుటుంబసభ్యులు మాత్రం.. శ్రావణి దూరమైతే.. తమ ఆర్ధిక పరిస్థితి ఏమౌతుందని భయపడ్డారు. ముఖ్యంగా శ్రావణి తమ్ముడు శివదుర్గ అనేవాడు మూర్కంగా ప్రవర్తించాడు. సోదరి తప్పు చేస్తున్నపుడు చూసీచూడనట్టు వదిలేశాడు. అక్క శరీరం తమను కూర్చోబెట్టి పోషిస్తుందని తెలిసినా తెలియనట్టుగా ఉన్నాడు. అదే అక్క కొత్త జీవితంలోకి వెళ్తానంటూ తట్టుకోలేకపోయాడు. సెప్టెంబరు 7వ తేదీ.. వీరందరూ కలసి శ్రావణిని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. దేవరాజ్ వైపు కన్నెత్తి చూస్తే అంతేనంటూ బెదిరించారు.
అయినా.. ఏదోమూలన ఆశ.. దేవరాజ్ రాకపోతాడా! తనను తీసుకెళ్లకపోతాడా! అని ఎంతో తపించింది. తన దీనస్థితిని ఫోన్ ద్వారా దేవరాజ్‌కు చెప్పింది. ప్లీజ్ నన్ను తీసుకెళ్లు అంటూ ప్రాధేయపడింది. నువ్వులేక నేను లేనంది.. తన తప్పులను మన్నించమంటూ కోరింది.. కానీ దేవరాజ్ మాత్రం.. బతికేందుకు తప్పుచేసిన శ్రావణిని వదిలించుకోవాలనుకున్నాడు. తన అందానికి.. రేపు రాబోయే పేరు ప్రఖ్యాతులకు ఆమె అడ్డమని భావించాడు. అంతే.. నీ ఖర్మ నీదేనంటూ చెప్పేశాడు. అంతే.. అప్పటివరకూ కాస్తో..కూస్తో ఉన్న నమ్మకం కూడా ఆమెలో సన్నగిల్లింది.. అక్కున చేర్చుకోవాల్సిన ఫ్యామిలీ.. తన అందాన్ని పొగిడి.. ఆడుకుని.. ఆశలు తీర్చుకున్న ముగ్గురు మగాళ్లు చేసిన మోసాన్ని.. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించింది. అంతే.. తన చేతులతో తానే చివరి పేజీ రాసుకుంది. తనలాంటి ఎంతో మంది అమాయక యువతులకు చెప్పకనే హెచ్చరిక చేసింది.



