ఎప్పుడూ సిగ్గుపడుతూ కనిపించే పిల్లాడు. పదిమందితో కలవాలంటే బిడియపడే అబ్బాయి. మెగాస్టార్ తమ్ముడు కాబట్టి ఇంత పొగరనుకుంటా! చిన్నప్పుడు కళ్యాణ్‌బాబుపై ఉన్న అభిప్రాయం. ఇప్పుడు అదే పిల్లాడు.. ఆరడుగుల బుల్లెట్‌గా ఎదిగారు. హిమాలయమంత ఆత్మవిశ్వాసం.. జాతీయ జెండాకు ఉన్న ఠీవీతో కోట్లాదిమందికి చేరువయ్యాడు. పవన్‌కళ్యాణ్‌గా మారి.. పవర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఎవరికైనా.. ప్లాప్‌లు.. హిట్లు ఫ్యాన్స్ సంఖ్యను తారుమారు చేస్తుంటాయి.అదేమిటో.. పవన్‌కళ్యాణ్ సినిమాలు అన్నీ వరుసకట్టి అట్టర్‌ప్లాప్‌లు అవుతున్నా.. ఏమిటో ఈ అభిమానులు ఒక్కరు కూడా వెనుకంజ వేయరు. సింపుల్‌గా ఉంటాడు.. ఎవరు సాయమడిగినా చేస్తాడు. ఓడినపుడు కుంగిపోడు. గెలిచాం కదా! అని పొంగిపోలేదు. నరనరాన దేశభక్తి.. జైహింద్ నినాదం.. పక్కోడి కడుపు ఆకలితో ఉంటే తట్టుకోలేని మనస్తత్వం.. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరుపెట్టుకునే మానవత్వం. ఎక్కడ నెగ్గాలో కాదురా. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలంటూ ఇచ్చిన సందేశం.
ఇవన్నీ కేవలం వెండితెరమీదనే కాదు.. నిజజీవితంలోనూ ఆచరించగల స్పూర్తి నింపే వ్యక్తిత్వం.. కాబట్టే.. కోట్లాది మంది ఫ్యాన్స్ పవన్ అనగానే పరుగులు పెడతారు. పేరు వినపడగానే పూనకం వచ్చినట్టుగా ఫీలవుతారు. దక్షిణాధిన ఎంతమంది హీరోలున్నా పవన్ క్రేజ్ ప్రత్యేకం. గెలిచినపుడే కాదు. ఓడినపుడు కూడా వెంటనడిచేందుకు మేమున్నామంటున్నారు. ఒక్కసీటు గెలిచి ఏం సాధిస్తారంటే.. మేం గెలిచేందుకు రాలేదు.. పోరాడేందుకు వచ్చామంటూ పవన్ ఇచ్చిన నినాదం.. ఓటమంటే భయపడే ఎందరికో పోరాడేందుకు బలాన్నిచ్చే భరోసా. ఇంతగా పాపులారిటీ సంపాదించిన.. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ముచ్చట్లు..
నాకో తిక్కుంది.. దానికో లెక్కుందంటూ.. ఘాటైన డైలాగ్లు చెప్పిన పవన్‌కళ్యాణ్ పుట్టింది ఎక్కడో తెలుసా! మిర్చిఘాటుకు కేరాఫ్ చిరునామా.. గుంటూరు జిల్లా బాపట్లలోనే. 2 సెప్టెంబరు 1972లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. అందరకంటే చిన్నోడు కావటంతో ముద్దు చేసేవారు. పెద్దన్నయ్య చిరంజీవి పెళ్లితరువాత వదిన సురేఖ అన్నీతానై పవన్‌ను సాకారు. అందుకే.. అన్నా వదినలను అమ్మానాన్నలంటూ చెబుతుంటారు పవన్. రాముడుకు లక్ష్మణుడుగా చిరంజీవికి పవన్ అండగా ఉంటున్నారు. చిరును ఎవరేమన్నా.. ఒంటికాలిమీద లేవటం.. గొడవలకు దిగటం పరిపాటే. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనూ 2009 ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఖుషీ తరువాత వరుసగా ఆరేడు సినిమాలు ప్లాపయినా ఎక్కడా కుంగిపోలేదు. ఏ నిర్మాత కూడా నష్టపోయినట్టు ప్రకటించలేదు. ఎందుకంటే.. పవన్ ఉంటే చాలు.. రూ.60-70 కోట్లు గ్యారంటీ అనేది వారి నమ్మకం. 1996లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి తొలిసినిమాతో మంచి మార్కలు.. ఛాతీపై బలమైన బండరాళ్లు పగలుకొట్టడం, చేతులపై వంద కార్ల వెళ్లటం.. మార్షల్ ఆర్టులో చేసిన ఫీట్లు… ఇతగాడిలో ఏదో ప్రత్యేక ఉందనే నమ్మకాన్ని పెంచింది. రెండో సినిమా గోకులంలోసీత.. వావ్ అనిపించింది. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడుతో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. బద్రీతో కొత్తమేనరిజం పరియం చేశాడు.. పవర్‌స్టార్‌గా ఎదిగాడు. రికార్డు బ్రేక్‌లు.. సరికొత్త రికార్డులకు కేరాఫ్ చిరునామా అయ్యాడు.
2014 మార్చి 14న జనసేన తో రాజకీయ ప్రవేశం.. అదే ఏడాది ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకు మద్దతు. 2019లో పోటీచేసిన రెండుచోట్ల ఓటమి.. కేవలం ఒక్కసీటు గెలుపొందటం.. ఇవన్నీ పవన్‌కు కుంగదీస్తాయను కున్నారు. అలా జరిగితే.. పవర్‌స్టార్ ఎందుకవుతాడు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటున్నాడు. నసైనికులకు స్పూర్తిని పంచుతూనే ఉన్నారు. రాజకీయనేతలంటే.. ఎన్నికలపు రావటం.. అధికార పార్టీను తిట్టడమేకాదు. జనం మధ్యనే ఉంటూ.. మంచి పనిచేసినపుడు అధికారపార్టీను ప్రశంసించటమూ చేయాలంటూ కొత్తరాజకీయాలకు మార్గం పరిచారు.



