నటిగా ప్రత్యేక గుర్తింపు.. రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్న సుమలత. కన్నడ ఇంట కోడలుగా అడుగుపెట్టిన ఈమె అచ్చతెలుగు ఆడపిల్ల. గుంటూరు జిల్లా స్వస్థలం. చెన్నైలో చదివిన సుమలత పుట్టినరోజు ఈ రోజు. 1963 అగస్టు 27న పుట్టారు. 14 వ ఏట తొలిసారి వెండితెరపై కనిపించారు. 1979లో ఆంధ్రబ్యూటీ ఎంపికైన ఈమెను మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడు ఆమెకు ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.1001 అన్నమాట. అలా తమిళంలో మొదటి సినిమాలో పనిచేసిన ఆమె.. క్రమంగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. సమాజానికి సవాల్ అనే సినిమాలో కీలకరోల్ చేశారు. 1980 తరువాత సుమలత వెనుతిరిగి చూడలేదు.. తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం ఇలా దాదాపు 220కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, మురళీమోహన్, తదితరులతో కలసి నటించారు. తొలిసారిగా కరుణామయుడు తో తెలుగులో నటించారు. చిరంజీవితో శుభలేఖ, ఆలయశిఖరం, ఖైదీతో మెరిశారు. కృష్ణంరాజుతో జంటగా అంతిమతీర్పు సినిమాలో నటనకు పురస్కారం అందుకున్నారు. 1991కన్నడ నటుడు అంబరీష్‌ను వివాహమాడారు. అదే ఏడాది నటించిన గ్యాంగ్‌లీడర్, డబ్బు భలే జబ్బుతో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. ఆ తరువాత చాన్నాళ్లకు బాస్, అస్త్రం, శ్రీరస్తు శుభరస్తులో సెకండ్ ఇన్నింగ్స్‌తో ఈ తరం ప్రేక్షకులను మెప్పించారు. 2018లో భర్త అంబరీష్ మరణించటంతో సుమలత రాజకీయాల్లోకి వచ్చారు. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో మాండ్యం పార్లమెంటరీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం అందుకున్నారు. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఇన్నేళ్ల సినీ, రాజకీయాల్లో స్వచ్ఛమైన మహిళగానే గాకుండా ఉత్తమ వ్యక్తిత్వం గల నేతగా ఎదిగారు. ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా
నిలుస్తున్నారు.