బుర్రిపాలెం బుల్లోడు సూప‌ర్‌స్టార్ ఎలా అయ్యాడు!

అల్లూరి సీతారామ‌రాజు అన‌గానే గుర్తొచ్చే పేరు.. అగ్గిపెట్టె ఉందా అంటూ కంచుకంఠంతో థియేట‌ర్ల బ‌ద్ద‌లు చేసిన హీరో అనేగానే గుర్తొచ్చే పేరు.. రికార్డులు… కొత్త ప్ర‌యోగాలు.. జేమ్స్‌బాండ్‌, కౌబాయ్ అనగానే గుర్తొచ్చేది ఒకే ఒక్క‌డు… ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌. సూప‌ర్‌స్టార్ అన‌గానే గుర్తొచ్చే పేరు కృష్ణ‌. తెలుగు అభిమానులు ముద్దుగా పిలుచుకునే కిట్టిగాడు. ఔను.. డైలాగ్ డెలివ‌రీలో ఆయ‌న శైలి వేరు. స్టెప్పులు వేసినా వేయ‌క‌పోయినా చేతులు తిప్పితే చాలు. ఈలలే ఈల‌లు. అజాత‌శ‌త్రువుగా ఐదు ద‌శాబ్దాలకు పైగా వెండితెర‌పై వెలుగొందుతున్న న‌టుడు. వార‌సుడిగా మ‌రో సూప‌ర్‌స్టార్‌ను వెండితెర‌కు అందించిన సూప‌ర్‌స్టార్ గుంటూరు జిల్లా తెనాలికి 5 కి.మీ దూరంలోని బుర్రిపాలెం. 1943 మే 31న పుట్టారు. న‌లుగురు సోద‌రుల మ‌ధ్య ఎదిగాడు. రోజూ 4 కి.మీ దూరంలోని తెనాలి వ‌చ్చి చ‌దువుకునేవాడు. ప‌దోత‌ర‌గ‌తి అంటే.. అప్ప‌ట్లో ఎస్ ఎస్ ఎల్‌సీ కోసం గుంటూరు చేరారు. ఇంజ‌నీరింగ్‌కు ముందు చ‌దివే పీయూసీ న‌ర్సాపూర్‌లో చ‌దివారు. అయితే ఇంజ‌నీరింగ్‌లో సీటు రాక‌పోవ‌టంతో సినిమా వైపు అడుగులు వేశారు. దానికి ప్రేర‌ణ కూడా ఎన్టీఆరేన‌ట‌. అప్ప‌ట్లో పాతాళ‌బైర‌వి సినిమా కృష్ణ‌ను బాగా ఆక‌ట్టుకుంద‌ట‌. ఆ స‌మ‌యంలోనే కారులో గుంటూరు వ‌చ్చిన ఎన్టీఆర్‌ను చూసేందుకు జ‌నం కారు వెంట ప‌రుగులు తీశారు . దాన్ని చూసిన కృష్ణ సినీస్టార్‌ల‌కు ఇంత క్రేజ్ ఉంద‌నే ఉద్దేశంతో తాను కూడా సినిమా హీరోగా మారాల‌నుకున్నాడు. తండ్రి సిఫార్సుతో మ‌ద్రాసు వెళ్లినా మొద‌ట చూద్దాం.. చేద్దామ‌నే మాట‌లే వినిపించాయి. పెద్ద ద‌ర్శ‌కులు కూడా కృష్ణ‌ను చూసి అందంగా ఉన్నావ్‌.. మంచి ఫీచ‌ర్ ఉంటుందంటూ ఆశీర్వ‌దించారు. అయితే సినిమా అవ‌కాశాలు మాత్రం రాలేదు. చివ‌ర‌కు ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వంలో కొత్త వాళ్ల‌కోసం ఇచ్చిన ప్ర‌క‌ట‌న కృష్ణ‌ను మ‌రోసారి త‌మిళ‌నాడు చేర్చింది. అలా.. అక్క‌డ హీరోగా ఎంపికైన కృష్ణ తేనెమ‌నసులుతో సినిమాతో తెరంగేట్రం చేశారు. రెండో సినిమా క‌న్నెమ‌న‌సులు కూడా ఆదుర్తి కృష్ణ‌నే హీరోగా తీసుకున్నారు.

రెండో సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు డూండీ కృష్ణ‌తో జేమ్స్ బాండ్ సినిమాకు ఆలోచన చేశారు. అలా ట్రెండ్ సెట్ చేసిన సినిమా గూడ‌చారి 116 ఆ సినిమాతో కొత్త ష్టైల్‌.. హాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన జేమ్స్‌బాండ్‌, కౌబాయ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఏడాదికి 17, 18 సినిమాలు తీయ‌టం ఆయ‌న‌కే చెల్లింద‌ని చెప్పాలి. అలా మొద‌లైన ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అడుగులు ఐదేళ్ల‌లో ఎవ‌రెస్ట్ అంత ఎదిగారు. ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ల త‌రువాత కృష్ణ అనేంత‌గా ఎదిగారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినా కృష్ణ మాత్రం కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక‌.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా నా పిలుపే ప్ర‌భంజ‌నం, మండ‌లాదీశుడు వంటి ఎన్నో సినిమాలు తీశారు.


అల్లూరి సీతారామరాజు సినిమా స‌మ‌యంలో ఎన్టీఆర్‌తో త‌లెత్తిన చిన్న వివాదం ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెంచింది. ఎంపీగా కృష్ణ ప్ర‌జానేత‌గా ఎదిగారు. 1986లో పెద్ద కుమారుడు ర‌మేష్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సామ్రాట్ సినిమా తీశారు. ర‌మేష్ న‌టుడుగా నిరూపించుకున్నా ఎక్కువ స‌మ‌యం నిలుబ‌డ‌లేదు. కూతురు ను హీరోయిన్‌గా చేయాల‌నే ఆలోచ‌న‌కు అభిమానులు బ్రేక్ వేశారు. బాల‌న‌టుడుగా స‌త్తాచాటిన మ‌హేశ్‌బాబును అందించి సూప‌ర్‌స్టార్ అభిమానుల‌ను ఖుషీ చేశారు. 2016 వ‌ర‌కూ సినిమాలు చేసిన కృష్ణ సుమారు 370 వ‌ర‌కూ సినిమాల్లో న‌టించార‌. విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. 78 వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తండ్రికి త‌న‌యుడు మ‌హేష్‌బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

Previous articleఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా వస్తున్న సినిమా “ఇక్షు”
Next articleకృష్ణంప‌ట్నంలో ఏం జ‌రుగుతోంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here