గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. పనిలో పనిగా నేతలు కూడా మాంచి దూకుడు మీదనే ఉన్నారు. ఇదంతా ప్రత్యర్థుల మీద అనుకునేరు.. అబ్బే.. పక్కోళ్లతో మాకెందుకండీ మాలో మేం కొట్టుకున్నాకే.. నెగ్గినోడు.. పక్కోడికి సాయ పడతాం అంటున్నారట. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశం.. ఇంతలో మాటామాటా పెరిగింది. అంతే వర్గపోరులో ముందుండే హస్తంలోని నిరంజన్, శ్రావణ్ ఇద్దరూ పోటాపోటీగా తిట్ల పురాణం అందుకున్నారట. తొడకొట్టి గోదాలోకి దిగి కొట్టుకుందామనేంతగా కేకలు.. హాహాకారాలు.. బాబోయ్.. ఇంకేముంది.. టీఆర్ ఎస్ మీద నెగ్గాలని ప్లాన్ చేద్దామనుకున్నోళ్లంతా.. బిక్కముఖాలేసుకుని వెళ్లిపోయారట. ఎంతైనా కాంగ్రెస్ కదా! అక్కడ అందరూ నాయకులే ఉంటారంటే
ఏమో అనుకున్నాం.. రచ్చ చూశాక నిజమే అనిపిస్తుందంటూ కార్యకర్తలు ఫీలయ్యారట.
తెలంగాణ కాంగ్రెస్.. బలమైన కేడర్ ఉన్నా.. 2018 ముందస్తు ఎన్నికల్లో కోరి తెచ్చుకున్న చంద్రబాబునాయుడు దెబ్బేశాడు. పోన్లే.. 2019లో అయినా ఎంపీ సీట్లు గెలుచుకుందామంటే.. అంతర్గత కుమ్ములాటలు.. రెడ్డి, బీసీ వర్గాల మధ్య వార్ పూర్తిగా తుడి పేసింది. ఇప్పుడు హస్త రేఖలను సరిగా మార్చుదామని ఎవరైనా కంకణం కట్టుకుంటే.. కిందకు లాగేందుకు తలో చేయి వేస్తు న్నారట. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్ క్రమంగా నడిబజార్లో తిట్టుకునేంత వరకూ చేరింది. ఉత్తమ్ ను పీసీసీ పీఠం నుంచి దిగేంత వరకూ మేం ఊరుకోమంటూ కోమటి బ్రదర్స్ సవాల్ కూడా విసిరారు. టీ ఎన్నికల్లో హస్తం ఓటమికి బాబు కారణం అంటారు కానీ.. వాస్తవాని మాకు మేమే కారణమంటున్నారు సీనియర్లు.. గౌరవనీయులైన పెద్దలు జానారెడ్డిను కూడా పార్టీ వెనక్కునెట్టేసింది. జయపాల్‌రెడ్డి మరణించారు. రేణుకాచౌదరి అయితే.. పీసీసీ పీఠం తనకు ఇవ్వలేదనే ఉద్దేశంతో మొన్నఅధినేత్రి సోనియాగాంధీను వ్యతిరేకిస్తూ రాసిన లేఖపై సంతకం కూడా చేశారు. భట్టి విక్రమార్క.. హస్తం నుంచి గెలిచాక పీసీసీ పదవి కోసం తెగ పోటీపడుతున్నారు. వృద్ధనేతలు వీహెచ్ కూడా.. జెండాపట్టుకుని హల్‌చల్ చేస్తూనే ఉన్నాడు.
ఏడు పదులు దాటాక. ఎందుకీ పదవంటే.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నట్టుగా స్పందిస్తుంటారు. సీనియార్టీ ఉన్నవ్యక్తిగత లోపాలు.. నాయకత్వ లక్షణాలు లేకపోవటం ఆయన్ను మరింత అబాసుపాల్జేస్తున్నాయంటారు నేతలు. రేవంత్‌రెడ్డి మల్కాజగిరి ఎంపీ సీటు గెలిచాక.. హస్తంలో ఆయన క్రేజ్ పెరిగింది. రేవంత్ దూకుడును హస్తం ఉపయోగించుకోవాలని చూస్తుంది. హైకమాండ్ కూడా రేవంతుడికి పీసీసీ పీఠం ఇద్దామనుకుంది. కానీ.. సీనియర్లం మేం ఉండగా టీడీపీ నుంచి వలస వచ్చిన అతడికి ఎలా ఇస్తారంటూ సీనియర్లు గొడవ పెడుతున్నారట.