బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం

“తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో బాలల దినోత్సవం 2020 సందర్భంగా
“బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం” అనే అంశం మీద చర్చా కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తానా అధ్యక్షులు
శ్రీ తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ
“బాలసాహిత్యం మీదనే తెలుగు భాషా వికాసం ఆధారపడి ఉంది. బాల సాహిత్యం ద్వారానే పిల్లలకు మన సంస్కృతి, మన భాష, మన సాహిత్యం, నైతిక విలువలు అన్నీ లభిస్తాయి. తద్వారా వారు ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్ద పడతారు. ఎప్పుడైతే బాలసాహిత్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో ఆనాడు జాతి వైభవం కుంటుపడుతుంది. కాబట్టి ప్రాథమిక దశలో పిల్లలకు మాతృభాషలో బోధన జరిపించటంతో పాటు, కథలు, కవితలు, గేయాలు లాంటి బాలసాహిత్యాన్ని కూడా పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి రచనలను చేయాల్సిన కర్తవ్యం కవుల చేతుల మీద ఉంది.
. బాలసాహిత్యాన్ని భాషను ప్రోత్సహించటానికి “తానా” అనేక కార్యక్రమాలు చేస్తోంది. అమెరికాలో “మనబడి ” పాఠశాలలను విస్తృతంగా, విజయవంతంగా నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం జనవరిలో ఆరు లక్షల మంది విద్యార్థులతో “అమ్మానాన్న గురువు పద్యార్చన” పేరుతో సామూహిక పద్య పఠన కార్యక్రమం వైభవంగా నిర్వహించింది.
మొన్న అమెరికాలో “తానా బాలో త్సవమ్” అత్యంత ఘనంగా నిర్వహించి బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. భవిష్యత్తులో బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి తానా కట్టుబడి ఉంది.”
అని ఆయన అన్నారు.

తానా సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించారు. “బాలసాహిత్యం లేకపోతే సాహిత్యం
లేదు , సంస్కృతి లేదు, భాష ఉండదు , తద్వారా తెలుగు జాతి తన అస్తిత్వం, వైభవం కోల్పోయే ప్రమాదం వుంది. కాబట్టి బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిమీద ఉందని” ఆయన ఉన్నారు.

సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ
“బాల సాహిత్యం ఒక నది లాంటిది. అది నిండుగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది.
బాలసాహిత్య నదికి బాల సాహితీ వేత్తలు సంస్థలు, ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నాలుగు ఉప నదులు.
పిల్లలకు కథలు, గేయాలు, నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది , ప్రతి ఇంటిలో బాల సాహిత్యం పిల్లలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం తల్లితండ్రుల మీద ఉంది.” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన 9మంది లో ఒకరు డాక్టర్ పత్తిపాక మోహన్ గారు “అనువాద సాహిత్యం గురించి మాట్లాడుతూ… అనువాద సాహిత్యం వలన వేరువేరు భాషీయుల సంస్కృతులు,సంప్రదాయాలు విలువలు పరిచయం అవుతాయని, అనేక జీవన విధానాలు మనకు తెలిసి వాటిలో మెరుగైన మార్గాలను మనం అందిపుచ్చుకోవచ్చు.” అని ఆయన అన్నారు.
శ్రీ చొక్కాపు వెంకటరమణ  “వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుతూ..’ ఎల్ వో వి ఈ’ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని ఆధునిక వ్యక్తిత్వ వికాస ధోరణి లో ఆసక్తికరంగా చెప్పారు. నూతన టెక్నాలజీ కి అనుగుణంగా పిల్లలు ఎదగాల్సిన అవసరం ఉందని బాల సాహిత్య రచనలు ఆ కోణంలో జరగాల్సిన అవసరం ఉందని” ఆయన అన్నారు.
శ్రీ దాసరి వెంకట రమణ  మాట్లాడుతూ” చందమామ కథల పత్రిక వైభవాన్ని గురించి ఎంతో చక్కగా వివరించారు. ఒకప్పుడు చందమామ పత్రిక ఎంతోమందిలో మార్పుకు, మనోవికాసానికి దారితీసిందని, చందమామ వంటి బాలల కధల పత్రికలు మరన్ని మరలా రావాల్సిన అవసరం ఉందని” ఆయన అన్నారు.
శ్రీ పైడిమర్రి రామకృష్ణ  భాషా వికాసం గురించి,శ్రీ బెలగాం భీమేశ్వరరావు బాల గేయాల గురించి,శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రచయిత్రుల గురించి, డాక్టర్ సిరి గారు విజ్ఞాన రచనలు గురించి, డాక్టర్ శర్మ గారు కథలు చెప్పడం గురించి, మంచి పుస్తకం సురేష్  ప్రచురణ ల గురించి అత్యంత ఆసక్తికరమైన ప్రసంగాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు.
బాల సాహిత్యం లోని లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆసక్తిగా జరిగి ఉపయుక్తమైన, నిర్మాణాత్మకమైన, కార్యక్రమంగా నిలిచింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here