అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మించిన ఉత్కంఠ. అసలు ఇవేం ఎన్నికల్రా బాబోయ్ అనేంతటి నిర్లిప్తత. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధికార పార్టీకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసలే ఎవరో ముక్కు ముఖం తెలియని.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరమీదకు రావటం.. అది కూడా రెండోప్లేస్‌లో నిలవటం.. ఈ సారి ఎన్నికల్లో కొత్త పరిణామం. దాదాపు 30,000 మంది పట్టభద్రులు వేసిన ఓట్లు చెల్లనివిగా ఉండటం.. గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ చేసిన ఇన్ని వేలమందికి ఓటు వేయటం తెలియకపోవటంపై ట్రోలింగ్ జరుగుతుంది. వీళ్లంతా చదువుకున్నారా. డిగ్రీలు కొనుక్కున్నారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇటువంటి ఎమ్మెల్సీ ఫలితాల వెలువడేందుకు మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోవటమే అసలు కొసమెరుపు.
తెలంగాణలో పాగా వేయాలని పావులు కదిపే బీజేపీకు ఇది జీవన్మరణ గెలుపు. అకస్మాత్తుగా పీవీ వారసురాలిని తెరమీదకు తీసుకొచ్చి ఓటేయమంటూ సెంటిమెంట్ రగిల్చిన కేసీఆర్. తీన్మార్ మల్లన్నగా పాపులారిటీ సంపాదించిన జర్నలిస్టు నవీన్‌కు పోలైన ఓట్లు, కోదండరాం సార్.. ఇలా నలుగురి మధ్య రసవత్తరమైన రాజకీయం సాగుతోంది. కాంగ్రెస్ బరిలో నిలిపిన చిన్నారెడ్డి విజేతగా నిలుస్తారనే అంచనాలు తారుమారయ్యాయి. చివర్లో ఎలిమినేట్ అయ్యారు. రేపు నాగార్జునసాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖేల్ ఖతం అనేందుకు ఈయన ఓటమి కూడా పునాది వేసినట్టయింది. ఇకపోతే.. సురభి వాణీదేవి, రాంచందర్‌రావు, కొదండరామ్, తీన్మార్ మల్లన్న వంటి వారి మధ్య పోరు.. ఎంత వరకూ సాగినా.. వీరిలో ఎవరు గెలిచినా.. ఓడిన వాళ్లు మాత్రం రేపటి రాజకీయాలకు అసలు సిసలైన వారసులుగా జనం భావిస్తున్నారనేది మాత్రం అక్షర సత్యం. . తీన్మార్ మల్లన్న అనే ఒక బీసీ వ్యక్తి…. చూపించిన తెగువకు.. ప్రజలు పట్టిన నీరాజనం.



