ఆ గుండెలు శతఘ్నులు. వారి శ్వాస శత్రువుల వెన్నులో వణకుపుట్టించే తూటాలు. కంటిచూపు చాలు.. వైరివర్గాలు కకావికలమవుతాయి. గట్టిగా అరిస్తే.. దిక్కులు పిక్కటిల్లాల్సిందే.. టన్నుల కొద్దీ అణుబాంబులున్న అమెరికా.. కోట్లాది మంది సైనికులున్న చైనా.. ఆత్మహుతి దాడులకు తెగబడే పాకిస్తాన్ వంటి దేశాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి కానీ.. భారత్ కనురెప్పను కూడా కదిలించలేకపోతున్నాయి. అదీ భారత సైనికుల సత్తా. ఉగ్రమూకల దొంగదెబ్బకు ఇద్దరు వీరులు అమరులయ్యారు. కశ్మీర్‌లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు నేలపై పుట్టిన వీరులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహేశ్ అసువులు బాశారు. నిత్యం చైనా, పాకిస్తాన్. ఉగ్రవాదులు. ముప్పేట దాడులు జరిగే చోట పహారా కాస్తూ.. ఏ క్షణాన ఏం జరుగుతుందనే చోట.. నిబ్బరంగా.. గుండె ధైర్యంతో భారతజాతీయజెండా కు ఉన్నంత ఆత్మవిశ్వాసంతో.. అక్కడ కాపలా కాస్తున్నారు. కళ్లెదుట.. అప్పటి వరకూ తనతో కలసి డ్యూటీ చేసిన సిపాయి.. రెప్పపాటులో తూటాతో బలైన.. ఏ మాత్రం చెక్కుచెదరకుండా దూసుకెళ్లే వీరయోదులు. సింహాలు సైతం.. వీరుల కళ్లల్లో మెరుపు చూసి భయపడి వెనక్కి పారిపోతాయనేంత పౌరుషం వారి సొంతం. అణుబాంబులు కూడా దెబ్బతీయలేని దృఢమైన మనోబలం సైనికులది.
బుల్లెట్లు ఎటునుంచి దూసుకొస్తాయో తెలియదు. ఆదమరపులో ఉన్నపుడు శత్రువు ఎలా దెబ్బతీస్తాడో తెలియదు. మంచుకొండల్లో ముంచుకొచ్చే ప్రమాదాలు లెక్కే ఉండదు. కదిలితే కాటేసే కాలనాగుల బుసలు పట్టించుకోరు. కాలిలో ముల్లుగుచ్చుకుంటేనే విలవిల్లాడే ప్రాణాలు. గడ్డం గీసుకున్నపుడు చిన్నగాయమైతేనే.. తల్లిడిల్లిపోయే జీవులు. కానీ.. అదేమిటో.. ఒక్కసారి యూనిఫాం.. ఒంటిపైకి చేరాక.. చేతికి తుపాకీ అందాక.. ఇవేమీ గుర్తుకురావు. కేవలం జాతీయజెండా నీడలో 130 కోట్ల మందిని కాపాడాలనే ఒకే ఒక్క ఆకాంక్ష తప్ప. ఇంట్లో పెళ్లాం..పిల్లలు.. వృద్ధులైన అమ్మనాన్నలు గుర్తొచ్చినా.. కోట్లాది మంది బిడ్డలను కాపాడే భరతమాత బిడ్డగా తన కర్తవ్యం ఇదేనంటూ ఎదురొడ్డి నిలబడతాడు. సరిలేరు నీకెవ్వరూ అంటూ ఎవరైనా పొగిడినా.. చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించేంత దగ్గరగా పహారా కాస్తుంటాడు. సరిహద్దుల్లో పహారా కాస్తూ… వీరులుగా మీసం మెలేసి.. శత్రువుల ప్రాణాలు తీసి వీరమరణం పొందిన సైనికులు మహేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇదే.. మా వందనాలు. ఎందుకంటే.. వాళ్లంతా వీరులు.. భారతీయులు పీల్చే ప్రతి శ్వాసలో ఉన్నవీరలందరూ.. చిరంజీవులు. బారతజాతిని మేలుకొలిపే మార్గదర్శకులు.