భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టిన తెలుగు మేధావి. రాజకీయ దురందురిడిగానే గాకుండా తెలుగు వ్యక్తిగా ఆయనకు ఎనలేని కీర్తి. పార్టీలకు అతీతంగా పీవీను ప్రశంసించేవారెందరో ఉన్నారు. అటువంటి మహానాయకుడు మరణిస్తే గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పాపం మూటగట్టుకుంది. ఆ తరువాత చానాళ్లకు పీవీ గురించి పట్టించుకోలేదు. కానీ.. పీవీ 100 జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్ హైజాక్ చేశారు. కేసీఆర్‌ను లక్ష్యం చేసుకుని విమర్శలు సంధించే హస్తంపార్టీకు ఊహించని షాక్‌నిచ్చారు. హైకమాండ్ మాట కాదని ఏమీ చేయలేని టీ హస్తం నేతలు చివరకు కేసీఆర్ మాటకే జై కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అదే బాటలో పీవీ కుమార్తె వాణిదేవిని ఎమ్మెల్సీ బరిలో నిలిపి గెలిపించమంటూ తెలంగాణ పట్టభద్రులకే బాధ్యత అప్పగించిన వ్యూహకర్త కేసీఆర్. ఎస్.. రాజకీయ మేధావిగా కేసీఆర్ స్థాయి చెక్కుచెదరనిది. మాస్‌ను క్లాస్‌ను మాటలతో ఆకట్టుకుని అప్పటి వరకూ తిట్టిపోసిన నోటితో మా కేసీఆర్ సూపర్ అని అనిపించగల వాక్సాతుర్యం ఆయన సొంతం.
2018 ముందస్తు ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా బలమైన ప్రతిపక్షం లేకపోవటంతో గెలుపును దక్కించుకున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా మారనుంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కారుకు బ్రేకులు వేశారు. బీజేపీ పుంజుకోవటం, కాంగ్రెస్ కూడా బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం వంటివి టీఆర్ ఎస్ గూటిలో కలవరం కలిగిస్తున్నాయి. కేటీఆర్ సీఎం అయితే తమదే పెత్తనం అని భావించి ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇటీవల కేసీఆర్ గట్టిగా హెచ్చరించారు. తానే సీఎంనంటూ లేనిపోని విషయాలను మీడియాతో పంచుకుంటే దంచుడే అని వార్నింగ్ ఇచ్చేంతగా కేసీఆర్ కోప్పడ్డారట. దీంతో అందరూ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పీవీ వారసురాలిని రంగంలోకి దింపి సెంటిమెంట్ పండించారు. ఏపీతో స్నేహహస్తం చాటుతూనే శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల విషయంలో కటవుగానే ఉంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలోనూ కేసీఆర్ ప్రజల్లో స్థానం సంపాదిం చారు. యాదగిరి ఆలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త సచివాలయం వంటి కీలక నిర్ణయాలతో క్లాస్‌లోనూ టాపర్‌గా నిలిచారు. వ్యూహకర్తగా తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. అయితే.. ఇంటిపోరుతో ఎదురయ్యే చికాకులను ఎలా ఎదుర్కోవాలనేది మాత్రం కేసీఆర్‌కు తలనొప్పిగా మారిందంటున్నారు గులాబీ నేతలు.