మొన్న జయప్రకాశ్ నారాయణ ఐఏఎస్‌కు రిజైన్ చేశారు. నిన్న జేడీ లక్ష్మినారాయణ.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో పదవి వద్దన్నారు. ఇప్పుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉత్తమ ఐపీఎస్‌గా ఉన్న పేరు ప్రఖ్యాతులను కాదని రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. జేపీ, జేడీ లక్ష్మినారాయణ ఇద్దరూ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా ఆశించినంత ఎదగలేకపోయారు. సంప్రదాయ రాజకీయాలతో పోటీపడలేక వెనుకబడ్డారు. జేపీ లోక్ సత్తా పార్టీతో ఎన్నో గొప్ప లక్ష్యాలతో జనం ముందుకు వెళ్లినా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమయ్యారు. జేడీ లక్ష్మినారాయణ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఇద్దరికీ అద్భుతమైన గుర్తింపు ఉంది. జనంలో క్రేజ్ ఉంది.. నీతి నిజాయతీలకు నిలువుటద్దమంటూ యువత స్పూర్తిగా తీసుకుంటారు. కానీ.. అవేమీ వారిని జనంలో నిలుపలేకపోయాయి. కేవలం వారి మాటలను మాత్రమే స్వీకరించే జనం.. రాజకీయ జీవితంలోకి వచ్చేసరికే వ్యతిరేకించారు. డబ్బులు పంచకుండా.. చుక్క లేకుండా ఓట్లేయటం మా వల్ల కాదనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. పైగా ఎంత సివిల్ సర్వీసు ఉద్యోగులైనా కేవలం ఆ ఉద్యోగంలో ఉన్నంత వరకూ వారికీ క్రేజ్.. ఇమేజ్ అనేది చెప్పకనే చెప్పినట్టయింది. ఇప్పుడు అదే బాటలో ప్రవీణ్‌కుమార్ ఎంత వరకూ సక్సెస్ అవుతారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. జేపీ వెనుక కమ్మ.. జేడీ వెనుక కాపు.. ప్రవీణ్‌కుమార్‌తో పాటు దళితులు ఉంటారనేది ఎంత వరకూ నిజమనేది కాలమే చెప్పాల్సిన సమాధానం.
ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్…. ఐపీఎస్‌కు వాలంటరీ రాజీనామా. దశాబ్దాలుగా సాధించలేని సమసమాజ స్థాపన లక్ష్యమంటూ పిలుపు. నిజమే.. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా లా అండ్ ఆర్డర్.. ఎన్‌కౌంటర్ల సంగతి అందరికి తెలిసిందే. వాటి జోలికి ఇప్పుడెళ్లటం అనవసరం. ఎందుకంటే… సర్కారు ఉద్యోగులు ఎవరైనా అప్పటి ప్రభుత్వ విధానాలు.. ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. అవి నచ్చినా నచ్చకపోయినా ఆర్డర్‌ను అమలు చేయాల్సిందే. గన్ నుంచి పెన్ పట్టానంటూ గురుకుల విద్యాలయాల బాధ్యతలు చేపట్టినపుడు ఆయన చెప్పిన మాట. తరచూ తన బాట ఇదంటూ చెబుతుంటారు. ఇదంతా తాను ఒంటరిగా అయినా చేస్తానంటున్నారిపుడు. ఇదంతా ఎవరి మీదైనా కోపమా.. సమాజ మార్పు కోసమా ! ఏమైనా ప్రవీణ్‌కుమార్ రాజకీయం అనుకున్నంత ఈజీ కాదనేది మాత్రం బహిరంగ రహస్యం.