11 నెలల పాటు లాక్‌డౌన్ బాధలు. సామాన్యుల నుంచి సినీవర్గాల వరకూ అంతటా గోలగోల. సినిమాలు మొదలు పెట్టినవాళ్లు షూటింగ్‌లు క్యాన్సిల్ కావటంతో గగ్గోలు. కోట్ల రూపాయలు ఖర్చుచేసిన నిర్మాత ల పెడబొబ్బలు. సినిమావాళ్ల కష్టాలంటే ఇలాగే ఉంటాయంటూ చూపారు. సినిమాలు, వెబ్‌సీరిస్‌లు మధ్యలో ఆగిన హీరోలు, దర్శకనిర్మాతలే కాదు.. హీరో హీరోయిన్లు కూడా ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. శుక్రవారం సంబరంగా కనిపించే వందలాది సినిమాహాళ్లు మూగబోయి కనిపించాయి. ఇప్పుడు క్రమంగా వైరస్ తగ్గుముఖం పట్టడంతో సినిమాలకు జనం వస్తున్నారు. ప్రేక్షకులను రంజింప చేసేందుకు ఓటీటీలో సినిమాలు విడుద చేసిన నిర్మాతలు మళ్లీ వాటిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కలర్‌పోటో, కపటదారి, చక్ర, ఆకాశం నీహద్దురా, క్రాక్, నాంది, ఉప్పెన, రెడ్ వరుసగా హిట్లు కొట్టాయి. థియేటర్ల వద్ద కలెక్షన్లు రాబట్టాయి. దీంతో మున్ముందు రిలీజ్ కాబోయే పెద్ద హీరోల సినిమాలపై అంచనాలు పెంచాయి. మరో నెల రెండు నెలల్లో పరీక్షలు పూర్తవుతాయి. దీంతో పిల్లలకు సెలవులు.. సినిమాలకు కలెక్షన్లు పెరుగుతాయని సినీవర్గాలు తెగ ఖుషీ అవుతున్నాయట. ఏమైనా.. వరుసగా సినిమాలు హిట్ కావటం టాలీవుడ్ కు కాస్త ఊపిరిపోసినట్టయింది.