టీటీడీ నెయ్యి సరఫరా వివాదం: హెరిటేజ్ ఒక్క పూస కూడా ఇవ్వలేదు!

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల తీవ్రంగా స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై వైసీపీని తీవ్రంగా విమర్శించిన ఆయన, హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు.
“వైసీపీ పాలనలో లడ్డును అపవిత్రం చేశారు. NDDB నివేదిక ప్రకారం వెజిటబుల్, జంతువుల కొవ్వు కలిసి ఉంది. సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకు 12.5 కోట్లు, చెన్నైకి 7.5 కోట్లు వచ్చినట్లు తేలింది. బహిరంగ మార్కెట్‌లో బటర్ 360 రూపాయలు ఉండగా 316 రూపాయలకు నెయ్యి ఎలా సరఫరా చేశారు? పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన మహానుభావులు వైసీపీ నాయకులు” అని ఆరోపించారు.
ధూళిపాళ్ల మాట్లాడుతూ, తనపై 22 కేసులు ఇంకా ఉన్నాయని, 33 రోజులు జైలు అనుభవం, సంగం డైరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాకు 307 కోట్లు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చిందని, భారతీ సిమెంట్స్ నుంచి 3 లక్షల టన్నుల సిమెంట్ కనిపించిందని గుర్తు చేశారు.
“సంగం డైరీ గుంటూరు రైతులది, శ్రీజ డైరీ చిత్తూరు మహిళలది. చంద్రబాబు చెప్పినందుకు కాకుండా, నిబంధనలు, సాంకేతిక పరీక్షలు పాస్ అయినందుకే టెండర్‌లో పాల్గొని సరఫరా చేస్తుంది. అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డైరీ” అని సవాల్ విసిరారు.
వైసీపీ నాయకులు స్వామి దగ్గరకు వెళ్లి తప్పు ఒప్పుకోవాలని, లేదంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుని ముందు బయటపడతారని హెచ్చరించారు.

 

Previous articleహీరోయిన్ అనన్య నాగళ్ళకు తీర్థ ప్రసాదాలు అందచేసిన తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here