టిక్‌టాక్.. షేర్‌ఛాట్.. ఫేస్‌బుక్ ఇలా ఎన్నో సోషల్‌మీడియా వేదికలు. యూత్‌లో టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశాన్నిచ్చాయి. ఏదైనా హద్దుల్లో ఉండాలనే గుణపాఠం కూడా నేర్పుతోంది. ఇప్పటికే ఎంతోమంది విలువైన జీవితాలను.. పరువు ప్రతిష్ఠలను చేతులారా నాశనం చేసుకున్నారు. అందంపై మోజు.. డ్రీమ్ వరల్డ్‌లో విహరించాలనే తాపత్రయం. ఇవన్నీ అమ్మాయిలు.. అబ్బాయిల జీవితాలను బుగ్గిపాల్జేస్తున్నాయి. ఒకరిద్దరు కాదు.. చాలా మంది టీవీ నటీనటులు కేవలం ఇటువంటి ఆకర్షణలకు లోనై విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఒక అందమైన అమ్మాయి..కొండపల్లి శ్రావణి ఎన్నో కలలతో టీవీ రంగంలోకి వచ్చింది. సవాళ్లను ఎదుర్కొంటూ పేరు తెచ్చకుంది. ఇంతలో టిక్‌టాక్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది. అక్కడే దేవరాజురెడ్డి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ప్రేమగా మారింది. టీవీ సీరియల్‌లో నటుడుగా అవకాశంగా కూడా ఇప్పిచ్చింది. దేవరాజ్‌లో క్రమంగా మార్పు వచ్చింది. ఆమెను వేధిస్తూ నరకం చూపసాగాడు. రాత్రిళ్లు.. ఆమె పోన్ తీసుకుని ఎవరితో మాట్లాడిందనే ఆరాలు తీసేవాడని శ్రావణి తల్లి ఆరోపించింది. దీన్ని భరించలేక జూన్22న ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కదా… ఇదేదో ప్రేమ వ్యవహారమని తేలికగా తీసుకున్నారు. ఇదే అదనుగా దేవరాజ్‌రెడ్డి మరింత బరితెగించాడు. ఇద్దరూ దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉంచుతానంటూ బ్లాక్‌మెయిల్ చేయసాగాడు.. ఎంతైనా ఆడపిల్ల చివురుటాకులా వణకిపోయి ఉంటుంది.. ఇంత వేదన భరించలేక.. మరణమే శరణ్యం అనుకుందంటున్నారు స్నేహితులు.
వెండితెర.. బుల్లితెర అదో రంగుల లోకంగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లినపుడు మాత్రమే అక్కడి లోటుపాట్లు తెలుస్తుంటాయి.. నీకు వేషమిస్తే నాకేమిటీ అనే ప్రబుద్ధులుంటారు. మేనేజర్ల నుంచి ప్రొడక్షన్ వరకూ అందరినీ సంతృప్తి పరిస్తేనే వేషమంటూ ఓ బుల్లితెర నటి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. గాయని చిన్మయి కూడా తాను చవిచూసిన ఘటనలు వివరించారు. అన్నిచోట్ల అలా లేకపోయినా..చాలా చోట్ల ఇదే ఉంటుందంటారామె. శ్రావణి మాత్రమే కాదు.. గతంలో బుల్లితెర నటులు ఝాన్సీ, విశ్వశాంతి, మద్దెల సబీరా అలియాస్ రేఖ, అనుపమ, ప్రదీప్‌కుమార్ ఇలా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనివెనుక.. అప్పటి వరకూ ఆరాధించిన వారు మోసం చేయటమో.. బ్లాక్‌మెయిల్‌కు భయపడటమో కారణాలుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించటం అసలు విషయం.