ఉపాసన కొణిదెల మెగా ఇంటి కోడలుగానే కాదు.. సామాజిక కార్యక్రమాల్లోనూ తనదైన భూమిక పోషిస్తుంటారు. సున్నితమైన అంశాలను కూడా ధైర్యంగా పంచుకోగలరు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా.. తన మాతృమూర్తి శోభన కామినేని గురించి గొప్ప విషయాన్ని ట్వీట్ చేశారు. తన తల్లి ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. 60 ఏళ్ల శోభన కామినేని.. అపోలో ఆసుపత్రుల వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో శోభన కామినేని.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లారు. అది కూడా.. సైక్లింగ్ చేస్తూ.. వందల కిలోమీటర్లు ప్రయాణించటం కొసమెరుపు. 6 రోజులు.. 60 ఏళ్ల వయసు 642 కిలోమీటర్ల ప్రయాణం అదే రికార్డ్. రోజుకు 100 కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చేస్తూ.. చెన్నై చేరారన్నమాట. ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకునే శోభన కామినేని ఆరు పదుల వయసులో సాధించిన రికార్డు.. కోట్లాది మంది మహిళలకు స్పూర్తి నింపుతుంది. నాలుగు పదుల వయసు చేరగానే ఇక పనైపోయిందంటూ.. ఇంటికే పరిమితమయ్యే ఎందరో గృహిణులకు శోభన కామినేని సైకిల్ యాత్ర ఆదర్శమనే చెప్పాలి. మహిళల ఆరోగ్యమే.. కుటుంబానికి ఆరోగ్యమంటూ ఉపాసన కొణిదెల ట్వీట్టర్ ద్వారా వెలిబుచ్చారు.