రౌడీ అంటారు.. కొందరు కులనాయకుడు అంటూ ఎద్దేవాచేస్తారు. అబ్బే.. అతడికి అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తారు. కానీ.. ఆయన ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో గెలుస్తుంటారు. ఎంతోమంది ఇప్పటికీ అదే నామజపంతో రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. పదవులు పొందుతున్నారు. అంతగా జనాల్లో మమేకమైన నాయకుడు వంగవీటి మోహనరంగా. అభిమానులు ముద్దుగా పిలుచుకునే వీఎంరంగా. బెజవాడ రాజకీయాల్లో తానొక సంచలనం. కాపుసామాజికవర్గంలో ఇప్పటికీ ఆయనే స్పూర్తిదాత. కృష్ణాజిల్లా కాటూరులో జులై4న పుట్టిన వంగవీటి రంగాది మద్యతరగతి కుటుంబం. ఐదుగురు సంతానంలో రంగా చివరివాడు. పెద్దగా చదువు అబ్బకపోయినా ప్రపంచాన్ని చదివాడు. పక్కోడి కష్టాన్ని పంచుకునేంత సహృదయుడుగా ముద్రవేసుకున్నాడు. కానీ నలభైఏళ్ల వయసులోనే ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అయినా.. ఇప్పటికీ ఆయన ఫొటోలు రిక్షాతొక్కే తాత జాగ్రత్తగా దాచుకున్నాడు. బెజవాడ కరకట్టపక్కన గుడిసెల్లో పేదింట పెద్దన్నయ్యగా మిగిలాడు. ఇంతగా ముద్రవేసుకున్న వంగవీటి రంగా 73వ జయంతి… ఏపీలో ఘనంగా జరిపారు. అసలు ఎవరీ రంగా.. ఎందుకీ పాపులారిటీ అనే విషయాలను ఒక్కసారి నెమరవేసుకుందాం!!
1970 దశకంలో బెజవాడ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. కాళేశ్వరరావు మార్కెట్ అప్పటికే జాతీయస్థాయిలో వ్యాపార సామ్రాజ్యం. ఆటోమొబైల్ రంగానికి బెజవాడే రాజధాని. రాజకీయంగా కూడా చాలా కీలకమైన నగరం. అటువంటి బెజవాడకు
రాధా, రంగా అనే సోదరులు చేరారు. కార్లు కొని అద్దెకు ఇవ్వటం..తిప్పటం మొదలుపెట్టారు. అప్పటికే విజయవాడలో ఆటోయూనియన్లు, కూలీ సంఘాలకు చలసాని వెంకటరత్నం సారథ్యం వహిస్తుండేవాడు. రాధా, రంగా యూనియన్ల విషయంలో చురుగ్గా ఉండేవారు. రంగా.. ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కారం చేసేవాడు. తేడాలొస్తే తోలు తీసేందుకు వెనుకాడనంతగా మారేవాడు. ఆ కళ్లలో ఎంతగా దయ ఉప్పొంగుతుందో.. అదేస్థాయిలో కోపం వస్తే అవతలి వారికి చెమటపట్టిస్తుంది. సోదరుల స్పీడు తెలుసుకున్న చలసాని వెంకరత్నం వారిద్దరినీ ప్రోత్సహించాడు. అనుచరులుగా అన్నదమ్ములు బాగానే చక్రం తిప్పారు. చలసానికి తెలియకుండా రాధా, రంగా చేసే పనులు ఇరువర్గాల మధ్య మనస్పర్థలు పెంచాయి. అదే సమయంలో బయటకు వచ్చిన రంగా, రాధా యునైటెడ్ ఇండిపెండెన్స్ పేరుతో యూనియన్ ప్రారంభించారు. దీంతో చలసాని సారథ్యంలోని ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్‌తో వైరం ముదిరింది. ఆ గొడవలో రాధా సోదరుల వర్గానికి చెందిన విద్యార్థి ని ప్రత్యర్థులు హత్యచేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే చలసాని వెంకటరత్నం మర్డర్ జరిగింది. దీంతో ఒక్కసారిగా రాధా,రంగా పేర్లు మారుమోగాయి. 1972లో చలసాని హత్యతో మొదలైన రక్తచరిత్ర క్రమంగా కొనసాగింది. 1974లో రాధా అనుచరుడు నాగాలి సహాయంతో రాధాను షాపు ప్రారంభోత్సవానికి పిలిపించి దారుణంగా హతమార్చారు. అయితే అప్పటికే రాధా రంగాలో స్నేహం చేసిన దేవినేని నెహ్రు ఆయన సోదరులతో క్రమంగా విబేధాలు మొదలయ్యాయి. రాధా హత్య వెనుక దేవినేని సోదరులు ఉన్నారనేది అర్ధమైంది. ఈ నేపథ్యంలోనే 1979లో దేవినేని గాంధీ ని ఐటీఐ కాలేజీలో దారుణంగా చంపేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రంగాను తీసుకుందామని అప్పటికే సీనియర్ నేతలుగా ఎదుగుతున్న కేకే, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటివారు పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. నాటి సీఎం జలగం వెంగళరావు మాత్రం రౌడీలు పార్టీలోకి వద్దంటూ దేవినేని, వంగవీటి వారసులకు చెక్ చెప్పారు. ఆ తరువాత 1984 ఎన్నికల్లో టీడీపీ రావటంతో దేవినేని ఆ పార్టీలోకి చేరాడు. ఆ నాటి మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచిన రంగాను కాంగ్రెస్ దగ్గరకు తీసుకుంది. 1988లో దేవినేని మురళీ వంగవీటి రంగా సతీమణి రత్నకుమారికి ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో రంగా వర్గం 1988లో దేవినేని మురళీను హత్యచేసింది. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రంగా తనకు గన్‌మెన్ కావాలంటూ నాటి టీడీపీ ప్రభుత్వానికి విన్నవించాడు. కానీ ప్రభుత్వం దాన్ని ఎందుకో పక్కనబెట్టింది. అదే సమయంలో రంగా కాపునాడు పేరిట విజయవాడలో భారీసభ ఏర్పాటు చేశాడు. అప్పట్లోనే సుమారు 2.5లక్షల మంది జనసమీకరణ జరిగింది. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ మనవాళ్లేనంటూ.. ప్రజాబలంతోనే ఏదైనా సాధించవచ్చంటూ కాపునాడు సభలో రంగా చేసిన ప్రసంగం చైతన్యానికి నాంధీ పలికింది. రంగా కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే భావించినా క్రమంగా ఆయన హవా పెరిగింది. ఆ సమయంలోనే రంగా బెజవాడలో దీక్షకు కూర్చున్నాడు. 1988 డిసెంబరు 26వ తేదీ అర్ధరాత్రి వ్యాన్‌లో వచ్చిన అగంతకులు.. బాంబులు వేస్తూ.. వేటకొడవళ్లతో రంగాను వెంటాడి దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి ఘటనతో ఉలిక్కిపడిన తెలుగునేల తేరుకునే ముందుగానే… జిల్లాలకు జిల్లాలు తుడుచుకుపోయే పరిస్థితులు తలెత్తాయి. రెప్పపాటులో దుకాణాలు దహనమయ్యాయి. బస్సులు, కార్లు, లారీలు.. అన్నీ అభిమానుల ఆగ్రహానికి ఆహుతయ్యాయి. దాదాపు నెలరోజుల పాటు కర్ఫ్యూవాతావరణం కనిపించింది. అంతగా రంగా జనాన్ని ప్రభావితం చేశాడు. అలా.. చలసానితో మొదలైన రక్తచరిత్ర రంగా వరకూ కొనసాగింది. బెజవాడలో ఆధిపత్యం కోసం మొదలైన పోరు.. రెండు కుటుంబాలకు పాకింది. క్రమంగా అది రెండు కులాలకు చేరింది. దశాబ్దాలపాటు కమ్మ వర్సెస్ కాపు అనేంతగా వైరం కొనసాగుతూనే ఉంది. ప్రజల్లో అంతటి ఇమేజ్ తెచ్చుకున్న రంగా స్థానాన్ని
వారసుడుగా రంగా తనయుడు రాధా భర్తీ చేయలేకపోయారు. అతడిపై జనాల్లో ఉన్న మితిమీరిన అంచనాలు కూడా దీనికి కారణమే. మరి ఆ కుర్చీలో ఇప్పుడు ఎవరు అనేందుకు కాపు వర్గం నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్కపేరు పవన్‌కళ్యాణ్.