క‌మ‌లంలో కుష్బూ.. నెక్ట్స్ విజ‌య‌శాంతి??

ద‌క్షిణాధిన ప‌ట్టు సాధించేందుకు బీజేపీ ప‌క్కా వ్యూహంతో ఉంది. ఒడిషాలో కాస్త బ‌ల‌ప‌డినా.. అధికారం సాధించేంత‌గా మార్చ‌లేక‌పోయింది. అప్ప‌టికే బ‌లంగా ఉన్న పార్టీల‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు నాయ‌క‌త్వ లేమి అడ్డంకిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఈ అనుభ‌వాన్ని అమిత్‌షా పాజిటివ్‌గా తీసుకున్నారు. అదే అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో జ‌రిగే ఎన్నిక‌ల కోసం ప్లానింగ్ మార్చుకున్నారు. ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీ సంగ‌తి ఎలా ఉన్నా.. ఆయ‌న గొంతు బీజేపీ వైపు ఉంటుంద‌నేది ప‌లు సంద‌ర్భాల్లో అర్ధ‌మైంది. క‌మ‌ల్‌హాస‌న్ ఎలాగూ క‌మ‌లం పార్టీకు వ్య‌తిరేకి కావ‌టంతో ర‌జ‌నీతో దోస్తీ క‌ల‌సివ‌స్తుంద‌ని బీజేపీ భావిస్తోంది. దీనికి మ‌రింత బ‌లాన్నిచ్చేందుకు సినిన‌టీ, కాంగ్రెస్ కీల‌క నేత ఖుష్బూను పార్టీలోకి ఆహ్వానించింది. తాను కూడా హ‌స్తంలో లుక‌లుక‌లు.. అంత‌ర్గ‌త పోరుతో ఇబ్బంది ప‌డుతూ.. అమిత్‌షా ఆహ్వానంతో కాషాయ కండువా క‌ప్పుకుంది. ఇది నిజంగానే బీజేపీకు అనుకూలించే అంశంగానే విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరి తెలంగాణ‌లో రాముల‌మ్మ రాజ‌కీయం సంగ‌తి ఏమిట‌నేది ఆస‌క్తిగా మారింది. ఖుష్బూ పార్టీ మార‌టంతో సినీ న‌టి.. హ‌స్తం నాయ‌కురాలు విజ‌య‌శాంతి కూడా బీజేపీలోకి చేరే అవ‌కాశాలున్నా య‌నే ప్ర‌చారం సాగుతోంది. తెలంగాణ ఉద్య‌మంలో గ‌ట్టిగానే స్వ‌రం వినిపించిన విజ‌య‌శాంతి అనంత‌రం సొంత‌పార్టీ ఏర్పాటు చేసి చేతులు కాల్చుకుంది. కేసీఆర్ చెల్లిగా ఆద‌రించ‌టంతో టీఆర్ ఎస్ గూటికి చేరింది. అక్క‌డ కూడా స‌రైన పీఠం ద‌క్క‌క‌పోవ‌టంతో రాముల‌మ్మ‌కు కోపం వ‌చ్చింది. అంతే.. వెంట‌నే కాంగ్రెస్ పార్టీలోకి జంప్‌చేశారు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ప్ర‌చారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చార వ్యూహంలో ఆమెనే ముందు వ‌రుస‌లో ఉంచారు. విజ‌య‌శాంతి పంచ్ డైలాగ్‌ల‌ను అస్వాదించిన జ‌నం.. ఓటేసేందుకు వెనుకాడారు. టీడీపీతో దోస్తీ చేసిన పాప‌ఫ‌లం.. కాంగ్రెస్‌ను ఘోర ప‌రాభ‌వం పాల్జేసిందంటూ విజయ‌శాంతి అనుచ‌రుల వ‌ద్ద కూడా అన్నార‌నే ప్ర‌చార‌మూ లేక‌పోలేదు. అప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ కు దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల హైక‌మాండ్ నుంచి వ‌చ్చిన ఠాకూర్ స‌మావేశానికి ఆహ్వానించినా వెళ్ల‌లేదు. పైగా.. ఇటీవ‌ల స‌రిలేరునీకెవ్వ‌రు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు విజ‌య‌శాంతి. ఆ సినిమా సూప‌ర్‌హిట్ కావ‌టంతో.. చాలా మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు రాముల‌మ్మ కోసం క్యూ క‌ట్టార‌ట‌. దీంతో ఆమె ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెబుతార‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఖుష్బూ బీజేపీలోకి చేర‌టంతో విజ‌య‌శాంతి కూడా త్వ‌రలో క‌మ‌లం తీర్ధం పుచ్చుకోవ‌చ్చ‌నే ఊహాగానాలు మ‌రింత పెరిగాయి.

విజ‌య‌శాంతి పార్టీ మారినా కాంగ్రెస్‌కు కొత్తగా వ‌చ్చే న‌ష్టం ఏమీలేద‌నేది పార్టీ హైక‌మాండ్ అంత‌ర‌గం. నిజ‌మే.. గ‌తంలో మాదిరిగా సినీతార‌ల వెంట ప‌రుగులు తీస్తూ.. పోలింగ్‌బూత్‌ల వ‌ద్ద‌కు చేరే అభిమానుల సంఖ్య కూడా త‌గ్గుతుంది. ఏపీలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌మిళ‌నాడులో విజ‌య‌కాంత్‌, క‌ర్ణాట‌క‌లో సాయికుమార్‌, సుదీప్‌ల‌కు రాజ‌కీయంగా ఎదురైన అనుభ‌వాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. నిజ‌మే.. రాజ‌కీయ‌నాయ‌కులు గొప్ప న‌టులుగా జీవిస్తున్న‌పుడు.. ఇక తామేపాటీ అంటూ సినీతార‌లు కూడా సెటైర్లు వేస్తున్నార‌ట‌. అలా అయితే.. బీజేపీలో ఖుష్బూ ఎంత వ‌రకూ ఓట్ల‌ను పెంచుతుంద‌నేది కూడా స‌స్పెన్స్ అన్న‌మాట‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here