2027 సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం భారతదేశంలో తయారుచేసిన 10 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని వెల్లడించిన వాల్‌మార్ట్

బెన్టోన్‌విల్లీ, ఆర్క్‌ మరియు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10,2020 ః ఉత్పాదకత పరంగా అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతున్న భారతదేశాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ, వాల్‌మార్ట్‌ నేడు తమ ఎగుమతులను భారతదేశం నుంచి మూడు రెట్లు వృద్ధి చేస్తూ 2027 సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 10 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను చేయనున్నట్లు వెల్లడించింది.

వాల్‌మార్ట్‌ యొక్క నూతన ఎగుమతుల వాగ్ధానం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ యొక్క సమర్థ్‌ మరియు వాల్‌మార్ట్‌ వృద్ధి సప్లయర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ ప్రయత్నాలతో పాటుగా భారతదేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎంఈ)లకు తోడ్పాటునందించనుంది. సేకరణ పరంగా ఈ విస్తరణలో భాగంగా వందలాది నూతన సరఫరాదారులకు సైతం సహాయపడనున్నారు. వీరిలో ఆహార, ఫార్మాస్యూటికల్స్‌, కన్స్యూమబల్స్‌, ఆరోగ్యం మరియు వెల్‌నెస్‌, సాధారణ మర్చండైజ్‌తో పాటుగా అప్పెరల్‌, హోమ్‌వేర్‌ మరియు ఇతర కీలక భారతీయ ఎగుమతి విభాగాలు ఉంటాయి.
‘‘అంతర్జాతీయ వాణిజ్య సంస్థగా ఇది వినియోగదారులకు మరియు కమ్యూనిటీలకు అంతర్జాతీయంగా విలువను తీసుకువస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య విభాగం విజయం సాధించడంలో అత్యంత కీలకమైన పాత్రను స్థానిక వ్యాపారవేత్తలు, తయారీదారుల పాత్రను పోషిస్తున్నారని వాల్‌మార్ట్‌ అర్ధం చేసుకుంది. వినూత్నమైన వ్యాప్తి మరియు వాల్‌మార్ట్‌ అందించే అంతర్జాతీయ పంపిణీ అవకాశాలపై ఆధారపడి భారతీయ సరఫరాదారులు వృద్ధి చెందేందుకు తగిన సామర్ధ్యం ఉందని వాల్‌మార్ట్‌ విశ్వసిస్తుంది’’ అని డౌ మెక్‌మిల్లన్‌, అధ్యక్షులు మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌–వాల్‌మార్ట్‌ ఐఎన్‌సీ అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘రాబోయే సంవత్సరాలలో గణనీయంగా భారతీయ వార్షిక ఎగుమతులను వృద్ధి చేయడం ద్వారా మేము మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి మద్దతునందిస్తున్నాము మరియు మరిన్ని స్ధానిక వ్యాపారాలు అంతర్జాతీయ వినియోగదారులను చేరుకునేందుకు సహాయపడుతున్నాం. అదే సమయంలో భారతదేశంలో ఉద్యోగాలను సృష్టిస్తూనే, సంపదనూ వృద్ధి చేస్తున్నాం. మరింత అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు వాల్‌మార్ట్‌కు ఓ మార్గంగా నిలువడంతో పాటుగా భారతదేశంలో తయారైన ఉత్పత్తులను అంతర్జాతీయంగా లక్షలాది మంది వినియోగదారుల చెంతకుతీసుకువస్తున్నాం’’ అని అన్నారు.
‘‘వేలాది భారతీయ బ్రాండ్లు, ఎంఎస్‌ఎఈలు, కళాకారులు విజయవంతం కావడంపై దృష్టి కేంద్రీకరించి మరీ కలసి పనిచేయడాన్ని ఫ్లిప్‌కార్ట్‌ గర్వంగా భావిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా విభిన్నమార్కెట్లను వారు చేరుకునేందుకు ఓ వేదికను అందించడంతో పాటుగా అతి ముఖ్యమైన బ్రాండింగ్‌, మార్కెటింగ్‌,లాజిస్టిక్స్‌ మరియు సమ్మతి సామర్థ్యంలను అంతర్జాతీయ మార్కెట్‌కు సైతం అందిస్తుంది. భారతీయ కంపెనీలకు సహాయపడటంతో పాటుగా మేక్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులను అంతర్జాతీయంగా తీసుకువెళ్లేందుకు వాల్‌మార్ట్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నాము’’ అని కళ్యాణ్‌ కృష్ణమూర్తి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌– ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ అన్నారు.
తమ భారతీయ ఎగుమతులను వేగవంతం చేస్తూ వాల్‌మార్ట్‌ ఇప్పుడు తమ సరఫరా చైన్‌ పర్యావరణ వ్యవస్ధను భారతదేశంలో బలోపేతం చేస్తుంది. ప్రస్తుత ఎగుమతిదారులతో పాటుగా ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యాపారాలను సైతం విస్తరించడం ద్వారా దీనిని సాధ్యం చేయనున్నారు.
గత 20 సంవత్సరాలుగా వాల్‌మార్ట్‌ పలు ఉత్పత్తులను భారతదేశం నుంచి సేకరిస్తుంది. ఇది స్థానిక సరఫరాదారులకు మద్దతునందించడంతో పాటుగా వారు తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడం మరియు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం, నూతన ఉత్పత్తి లైన్స్‌ను అభివృద్ధిచేయడం, ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌, సరఫరా చైన్‌ నిర్వహణ మరియు మరెన్నో అంశాల పరంగా నూతన సామర్థ్య నిర్మాణం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌ నైపుణ్యం వాల్‌ మార్ట్‌ తీసుకురావడంతో పాటుగా వ్యూహాత్మక ప్లానింగ్‌తో సరఫరాదారులు డిమాండ్‌ను ఊహించడానికి సైతం సహాయపడుతుంది. ఈ మద్దతు కారణంగానే వెల్‌స్పన్‌, ఎల్‌టీ ఫుడ్స్‌, అనికెట్‌ మెటల్స్‌ సహా వందలాది కంపెనీలు విజయవంతం కావడానికి తోడ్పడుతుంది మరియు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారాలైనటువంటి గ్లోబల్‌ గ్రీన్‌ కంపెనీ, మరియు మరెన్నో వృద్ధి చెందేందుకు సైతం తోడ్పడుతుంది.
‘‘వాల్‌మార్ట్‌ సరఫరాదారునిగా మేము 1998లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి వెల్‌స్పన్‌ ఇప్పుడు ప్రపంచంలో భారీ హోమ్‌ టెక్స్‌టైల్‌ తయారీదారునిగా నిలిచింది. మా ఉత్పత్తిలో 94% ఎగుమతి చేస్తున్నాం మరియు 20 వేల మందికి ఉపాధి అందిస్తున్నాం. వీరిలో 25% మంది మహిళలు’’ అని దీపాలీ గోయెంకా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మరియు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌– వెల్‌స్పన్‌ ఇండియా లిమిటెడ్‌ అన్నారు.
‘‘ మరీ ముఖ్యంగా, వ్యాపారాలు మార్పుకు వాహకాలుగా ఉంటాయి. వాల్‌మార్ట్‌తో మా సంబంధాలపై ఆధారపడి నాణ్యత, స్థిరత్వం మరియు వైవిధ్యత, సమ్మిళితపై దృష్టి కేంద్రీకరించాము. వెల్‌స్పన్‌ అనేది దేశీయంగా వృద్ధి చెందిన బ్రాండ్‌. ఇది మేక్‌ ఇన్‌ ఇండియా కథను అంతర్జాతీయంగా వృద్ధి చేస్తుంది. అంతేకాదు, ఈ సంక్షోభ సమయంలో భాగస్వాములుగా మేం బలంగా మారుతున్నాము. భారతీయ సరఫరాదారుల పట్ల వాల్‌మార్ట్‌ యొక్క విస్తరించిన నిబద్ధతతో మేము సంయుక్తంగా అగ్రగాములుగా నిలువగలం’’అని అన్నారు.
ప్రాధమిక స్థాయిలో, వాల్‌మార్ట్‌ యొక్క సరఫరా అభివృద్ధి కార్యక్రమం ‘వృద్ధి’ని గత సంవత్సరం ప్రారంభించాం. ఇది ఎగుమతుల నైపుణ్యం తీసుకురావడంతో పాటుగా ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన జ్ఞానం అందించడం ద్వారా భారతదేశం మరియు అంతర్జాతీయంగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటుగా ఇతర కంపెనీలు, వాల్‌మార్ట్‌ సరఫరా దారులుగా విజయవంతమయ్యేందుకు తోడ్పడుతుంది. ఐదేళ్లలో దేశీయ మరియు అంతర్జాతీయ సరఫరా చైన్‌లో మేక్‌ ఇన్‌ ఇండియాకు 50వేల ఎంఎస్‌ఎంఈలను శక్తివంతం చేయడమే లక్ష్యం.
ఇప్పటికే వాల్‌మార్ట్‌కు అగ్రశ్రేణి సోర్సింగ్‌ మార్కెట్‌లలో ఒకటిగా ఇండియా ఉంది. ఇక్కడ నుంచి వార్షిక ఎగుమతుల విలువ మూడు బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారతదేశంలో తయారుచేసిన వస్త్రాలు, హోమ్‌వేర్‌, ఆభరణాలు, హార్డ్‌లై్‌న్స్‌ మరియు ఇతర ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులు ప్రస్తుతం 14 మార్కెట్‌లలోని వినియోగదారులకు చేరుకుంటున్నాయి. వీటిలో యుఎస్‌, కెనడా, మెక్సికో, సెంట్రల్‌ అమెరికా మరియు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఉన్నాయి. వాల్‌మార్ట్‌ యొక్క గ్లోబల్‌ సోర్సింగ్‌ కార్యాలయం, బెంగళూరులో ఉంది. దీనిని 2002లో ప్రారంభించారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో సోర్సింగ్‌ కేంద్రాన్ని విస్తరించడం ద్వారా స్ధానిక బృందం స్థానిక వ్యాపారాలపై విస్తృత శ్రేణి రంగాలలో మరింత ప్రభావం చూపగలదు.

Previous articleమెగా ఇంట పెళ్లిసంద‌డి అదుర్స్ క‌దూ!
Next articleఅబ్బో అపార్ట్ మెంట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here