మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారా? ఏదైనా పార్టీలో చేరతారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్. నిజానికి తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక.. మొదట్లో నా కుడి భుజమంటూ పొగిడిన నేతలందరూ ఏదో ఒక సమయంలో అవమాన భారంతో బయటకు వెళ్లిపోతున్నారు. మొదట్లోనే.. విజయశాంతి, కోదండరామ్ మాస్టారు, డి.శ్రీనివాస్, నాయిని నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, మధుసూదనాచారి, స్వామిగౌడ్, విశ్వేశ్వర్‌రెడ్డి ఇలా చాంతాడంత జాబితాలో విజయశాంతి కాంగ్రెస్ ఆ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్వామిగౌడ్ కూడా అట్టాగే చేరారు. మాస్టారు మాత్రం కొత్త పార్టీతో కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వాలని ప్రయత్నించినా ఆశించినంత లాభం లేకుండా పోయింది. మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ వీడినా ఏ పార్టీలో చేరతారనేది ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు అదే బాటలో ఈటల చేరారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఎందుకింత వరకూ ఆయన్ను పార్టీ నుంచి తీసివేయలేదనేది విపక్షాల ప్రశ్న. ఈటల కూడా తాను బయటకు వెళ్లటంకంటే పొమ్మంటేనే వెళ్దామనే ధోరణిలో ఉన్నారు. దీన్ని ఏదో విధంగా తమకు అనుకూలంగా మలచుకోవాలనేది బీజేపీ, కాంగ్రెస్ వంటి విపక్షాల ప్రణాళిక. అందుకే.. బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటుగా.. తటస్థంగా ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డి వంటి వాళ్లు కూడా ఈటలతో టచ్‌లో ఉన్నారు.
అయితే ఈటల మాత్రం తాను ఏం చేయాలనుకుంటున్నది ఎవరి వద్ద ప్రస్తావించట్లేదు. పైగా అందర్నీ కలుపుకుని పోదామనే ధోరణిలో ఉన్నారు. అయితే ఇప్పటికే కొత్త పార్టీలు పెట్టి డిపాజిట్లు కూడా సాధించలేని నేతలు కళ్లెదుట ఉన్నారు. కాబట్టి ఈటల కొత్తపార్టీ పెట్టేంత సాహసం చేయకపోవచ్చు. ఏదైనా సంస్థ ద్వారా బీసీలను కూడగట్టే ప్రయత్నం చేసేందుకు వీలుందనేది రాజకీయ వర్గాల అంచనా. అయితే ఈటలపై పెరుగుతున్న సానుభూతితో కేసీఆర్ అండ్ కో వ్యతిరేకత ను తమకు అనుకూలంగా మలచుకోవాలనేది బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆలోచన. అందుకే.. ఈటల ఇంటి వద్ద పడిగాపులు కాస్తూ.. ఏదో ఒక జెండాకు జై కొట్టేంత వరకూ వేచిచూసే ధోరణితో ప్రతిపక్షాలున్నాయి. ఒకవేళ ఈటల కొత్త పార్టీ పెట్టినా ఎంత వరకూ దాన్ని నడిపించగలడనేది కూడా మరో చిక్కు ప్రశ్న. డబ్బులు దండిగా ఉన్న మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి వంటి వాళ్లు వెనుక నుంచి నడిపిస్తే కొత్త పార్టీకు అవకాశం ఉన్నట్టే. ఎందుకంటే… మరో వైపు జగన్ సోదరి షర్మిలమ్మ కూడా కేసీఆర్‌పై కత్తిదూసి రాజన్నరాజ్యం తెస్తానంటూ కొత్త పార్టీకు వ్యూహరచనలో ఉంది. జులైలో పార్టీ ప్రకటన కూడా చేయబోతున్నట్టు చెప్పారు.