పంచకట్టులో నిలువెత్తురూపం.. మాటతీరులో నాయకత్వం.. నడకలో రాజసం.. ఎంత పెద్ద బహిరంగ సభలో అయినా కళ్లన్నీ తనవైపు తిప్పుకునేంతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకట్టుకునేవారు. అభిమానులందరికీ ఆత్మబంధువుగా నిలిచారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకే పంథా. తన వాళ్లు అనుకున్నవారికి ఏదైనా చేయాలని తపించేవారు.
గుంటూరు జిల్లాలో ఒక నేత అనుభవం … అదొక రైల్వేస్టేషన్.. ప్రతిపక్ష నేతగా వైఎస్ అక్కడకు వెళ్లారు. అటువంటి సమయంలో వైఎస్ కోసం ఒక పెద్దరైతు ఆయన వద్దకు వచ్చాడు. కాసేపు మాట్లాడాడు. పార్టీకోసం తనవంతు సహకారం అందించారు. దీన్ని మరో నాయకుడైతే మరచిపోయేవాడేమో.. కానీ అక్కడ ఉంది.. వైఎస్ఆర్. సీఎం అయ్యాక.. తన ఇంటికి పిలిపించి మరీ.. సాయం చేశారు.
మరో నాయకుడు..చాలా కష్టాల్లో ఉన్నాడని తెలిసింది.. పార్టీ కోసం ఆస్తులు నష్టపోయాడనీ తెలుసు. కానీ.. ఆయన ఆత్మాభిమానం అడ్డొస్తుందని గుర్తించి.. ఆయన ఎదుగుదలకు ఊతమిచ్చారు. మళ్లీ నిలదొక్కుకునేలా చేశారు.
కృష్ణాజిల్లాలో ఒక నియోజకవర్గంలో కులాల పోరు ఉంటుంది.. అటువంటి చోట.. ఒక కులానికి సంబంధించిన నేతకు టికెట్ ఇస్తే ఓడిపోతుందంటూ వైఎస్‌కు నివేదిక ఇచ్చింది మరో వర్గం. వైఎస్ మాత్రం.. తన అనుచరుడుకే ప్రాధాన్యతనిచ్చారు. తాను ఓడినా ..అవతలి వర్గ నాయకుడు గెలిచినా రెండు తనకు ఒక్కటేనంటూ బహిరంగసభలో చెప్పి మరీ టికెట్ ఎనౌన్స్ చేశాడు.
ఖమ్మంజిల్లాలో ఓ ఉద్యోగి.. కాంగ్రెస్ అంటే గిట్టేది కాదు. కానీ.. తొలిసారి తాను వైఎస్ వీరాభిమానినంటూ ప్రకటించుకున్నాడు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ తో ఇద్దరు పిల్లలు పెద్ద చదువులు చదవి విదేశాలకు వెళ్లటం వైఎస్ పుణ్యమేనంటాడు. చిన్న జీతంతో అసలు ఇంజనీరింగ్ చదువు ఊహించుకోలేదంటారు.
ఇవన్నీ కేవలం ఉదాహరణ మాత్రమే.. 2004లో పాదయాత్ర చేస్తున్నపుడు.. ఓస్ ఇవెన్ని చూడలేదనుకున్నారు. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుంటే ఉలిక్కిపడ్డారు.. ఒక్కసారీ సీఎం అయితే.. పాతికేళ్లు దింపటం కష్టమే అనే అభిప్రాయానికి వచ్చారు ప్రత్యర్థులు. అనుకున్నట్టుగానే.. సీఎం కాగానే తొలి సంతకం.. ఉచిత విద్యుత్ రైతుల కోసంమంటూ చెప్పేశారు. 108, పింఛన్లు,
ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, పల్లెలకు సాగునీరు అందించిన అపరభగీరథుడుగా మిగిలాడు.. 2009లో కూటమి కట్టినా.. వైఎస్‌ను అంగుళం కూడా కదపలేకపోయారు.. కానీ విధి మాత్రం.. వైఎస్ మంచితనాన్ని చూసి కుళ్లుకుందనుకుంటా.. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదం రూపంలో బలితీసుకుంది. తెలుగునేలను అనాథను చేసింది.. కాలం కరిగిపోతున్నా..
ఇప్పటికీ చెక్కుచెదరని రాజన్నరూపం తెలుగు ప్రజల గుండెల్లో పదిలం..