కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ ఉండనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడు కన్నెర్రజేసినా ఏ మాత్రం పట్టింపులు ఉండవు. ఉదయాన్నే.. జై కొట్టిన వారంతా.. సాయంత్రానికి ఛీ అని జెండా తిప్పేయగలరు. అటువంటి చోట ఇప్పుడు అధికార పార్టీకు తలనొప్పి మొదలైంది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్సెస్ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మధ్య రగడ తారాస్థాయికి చేరింది. విషయం కాస్తా అధినేత జగన్ మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపినా దుట్టా పట్టు వీడలేదని సమాచారం. అసలే కృష్ణాజిల్లా కాపు , కమ్మ సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం. సున్నితమైన సమస్యను డీల్ చేసేందుకు వైసీపీ సీనియర్లు సిద్ధమవుతున్నారట. అవసరమైతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును రంగంలోకి దింపి సమస్యను కొలిక్కితీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు 15 రోజుల్లో శుభవార్త అంటూ దుట్టా ఇచ్చిన సంకేతం కూడా చర్చనీయాంశమైంది. అంటే.. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వంశీ వైసీపీ లోకి చేరలేదు. మొదట్లోనే జగన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేయాలనే షరతు విధించారు. దీన్నిబట్టి వంశీ పార్టీకు, పదవికి రాజీనామా చేయటం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరి అవుతుంది. అప్పుడు వైసీపీ ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది కూడా ఆసక్తిగా మారింది. దుట్టా మాత్రం తనకు సీటు కేటాయిస్తారని భావిస్తున్నా.. వైసీపీ అదిష్ఠానం మాత్రం సమీకరణల రీత్యా వంశీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దుట్టాకు నామినేటెడ్ పోస్టు ఇవ్వటం ద్వారా సంతృప్తి పరచాలనే కూడా అధినేతలో ఉందట. మరి దీనికి రామచంద్రుడు ఎంత వరకూ ఒకే చెబుతారనేది కూడా సస్పెన్స్.