ఎంత అద్భుతమైన దృశ్యం. ఎంతటి బావోద్వేగాలు పలికించే సన్నివేశం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. ఏ కారణంతో అయినా ఆమె దూరమైతే ఆ ఇంట ఎన్ని సిరి సంపదలున్నా చిమ్మచీకట్లే. ఆ చీకటిని దూరం చేయాలనే సంకల్పంతో.. ఓ భర్త గొప్ప ప్రయత్నమే చేశారు. కర్ణాటకలోని కొప్పళ పట్టణానికి చెందిన కె.శ్రీనివాసమూర్తి వ్యాపారవేత్త. ఆయన బార్య వెంకట నాగమాదవి. ఇద్దరు ముత్యల్లాంటి ఆడపిల్లలు. చింతల్లేని కుటుంబంలో చిన్న ఆశ. సొంతిల్లు నిర్మించుకోవాలనే ఆశయం. ఆలుమగలిద్దరూ భూమిపూజ కూడా చేశారు. కానీ.. ఇంతలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ ఇల్లాలు కనుమూసింది. కానీ అమ్మలేని లోటు. ఆ బిడ్డలకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఆమె కోరిక మేరకు చక్కటి ఇంటిని నిర్మించారు. మరి… గృహప్రవేశం రోజు.. అందరూ ఉన్నా ఇంటిదీపం లేకపోతే ఎలా! అనే శ్రీనివాసమూర్తి ఆలోచనకు చక్కటి రూపం వచ్చింది. ప్రముఖ కళాకారుడు శ్రీధరన్ ద్వారా నాగమాధవి రూపానికి బొమ్మరూపంలో ప్రాణప్రతిష్ట చేశారు. కుర్చీలో ఆమేను మహారాణిగా కూర్చోబెట్టి.. గృహప్రవేశం పూర్తిచేశారు. నిజంగా ఎంత గొప్ప ఆలోచన. ప్రతి చిన్న విషయానికీ బార్యను మనోవేదనకు గురిచేసే ఎందరో ప్రబుద్ధులకు ఇది నిజంగా ప్రేమగాయం. ఆనాడు.. సీతను అడవులకు పంపిన రాముడు.. యాగం చేసేందుకు జానకీదేవి బంగారు ప్రతిమను పక్కన ఉంచి పూర్తిచేశారని పురాణాల్లో చదివాం. ఇప్పుడు కలియుగంలో భార్యకు గుండెల్లో గుడికట్టి.. ఆమె ప్రతిమకు ప్రాణం పోసిన శ్రీనివాసమూర్తిని చూస్తున్నాం.