కోవిడ్ సమయాలలో, చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ ఉండటంతో, పాఠశాలలు తమ తరగతుల అధ్యయనాన్ని ఆన్-లైన్ కు మార్చవలసి వచ్చింది. క్లాసులను వర్చ్యువల్ ప్లాట్ ఫారంలద్వారా నిర్వహిస్తున్నారు. హోంవర్క్ డిజిటల్ అయింది. పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లో, తమ మొబైల్ ఫోన్, ఐపాడ్ లేదా లాప్ టాప్లపై దృష్టిపెట్టి గడపవలసివస్తోంది. ఇది వారి దీర్ఘకాల ఆరోగ్యంగురించి ఆందోళనలను లేవనెత్తుతుందని నేత్ర వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, అధిపతి, చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ డా రమేష్ కేకున్నయ పిల్లల కంటిచూపు గురించి పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు, గురువులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు అవేమిటో ఒక్కసారి చదవండీ.
ఎలక్ట్రానిక్ సాధనాల ఉపయోగంలో పెరుగుదల, దీర్ఘకాలం వాటికి దగ్గరగా పనిచేయడం , పగటి వెలుతురు తగలకపోవడం పిల్లలలో మయోపియా /దగ్గర దృష్టికి దారితీయవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి సమీప నీలికాంతి తరంగాలు వెలువడతాయని తెలిసినదే. ఇవి శరీరంలో సిర్కాడియన్ లయను నిర్వహించే మెలటోనిన్ అనే హార్మోనును అణిచివేస్తుంది. ఎక్కువకాలం నీలికాంతికి, ముఖ్యంగా వారి నిద్ర సమయంముందు, బహిర్గతం అవడం పిల్లలలో నిద్రాభంగం కలిగించవచ్చు. అతి ఎక్కువ స్క్రీన్ సమయం పొడి కన్ను, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన, ప్రవర్తన మరియు మానసిక సమస్యలకు దారితీయవచ్చుకూడా.
పిల్లలలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యా సంబంధిత బోధనకు మరియు మంచి శారీరక, మానసిక మరియు వ్యక్తిత్వ అభివృద్ధి మధ్య సమతుల్యతను నిర్వహించడం ముఖ్యం. అందువల్ల, అధ్యయనం కోసం ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని పరిమితం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలకు మెరుగైన జీవనశైలిని నిర్ధారించడానికి కొన్ని పద్ధతులను టీచర్లు మరియు తల్లిదండ్రులు మామూలుగా పాటించాలి.
పిల్లలు డిజిటల్ సాధనాలను ఉపయోగించే సమయం వారి వయస్సుకు తగినట్లు ఉండాలి. 12 నుంచి 16 వయస్సు పిల్లలకు 8 గంటల ఆన్ లైన్ బోధన అనుమతించవచ్చు. అంతకన్నా చిన్నపిల్లల స్క్రీన్ సమయం 4 గంటలకన్నా తక్కువగా ఉండాలి. పసిపిల్లలు (3 సంవత్సరాలకన్నా చిన్నవారు) ఏవిధమైన డిజిటల్ పరికరాన్ని వాడకుండా నివారించాలి.
తరగతుల సమయంలో టీచర్లు సముచితమైన విరామాలు తప్పనిసరిగా ఇవ్వాలి; ప్రతి 45 నిమిషాలకు ఒక చిన్న విరామం, సుదీర్ఘ సెషన్ల సమయంలో 1-2 గంటల దీర్ఘకాల విరామం ఇవ్వాలి. అన్ లైన్ తరగతులు ఉదయం మరియు మధ్యాహ్న సమయాలలో మాత్రమే జరగాలి. పిల్లలు ఈ సాధనాలను సాయంత్రం మరియు రాత్రి సమయంలో పిల్లలు వాడకుండా జాగ్రత్త వహించాలి.
వెనుకభాగం నిటారుగా ఉండి, చేతులు పెట్టుకునే విధంగా ఉన్నకుర్చీలో పిల్లలు కూర్చోవడం, కంటి స్థాయికి దాదాపు 2 అడుగుల దూరంలో స్క్రీన్ ఉండటం ముఖ్యం. ఇది మంచి భంగిమను నిర్ధారిస్తుంది మరియు భవిష్యత్తులో వెన్ను మరియు మెడ సమస్యలను నివారిస్తుంది. వీలయితే, డెస్క్ టాప్, లాప్ టాప్ లేదా టీవీవంటి పెద్ద స్క్రీన్ పరికరాలను ఉపయోగించడం మంచింది. గదిలో వెలుతురు బాగుండాలి. స్క్రీన్ ప్రకాశం అత్యంత అనుకూలంగా ఉండాలి. అధిక ప్రతిబింబాలను తగ్గించడానికి స్క్రీన్ ప్రొటెక్టర్లను ఉపయోగించవచ్చు.
గదిలో మంచి గాలి వెలుతురు ఉండాలి. వారిని నేరుగా ఏసీ/ఫాన్ క్రింద కూర్చోవడం వారి కళ్ళు త్వరగా పొడారిపోయేటట్లు చేస్తుంది. ఇది అలసటను ఎక్కువ చేస్తుంది. వారు కళ్ళను తరచుగా ఆర్పేటట్లు ప్రోత్సహించాలి. దీనికి తేలికైన పద్ధతి 20-20-20 నిబంధన. ఇందులో పిల్లలు ప్రతి 20 నిమిషాలకొకసారి 20 సెకన్లు విరామం తీసుకోవాలి, 20 అడుగులదూరంలో ఉన్న వస్తువువంక చూడాలి. ఇది కళ్ళలోని సిలియరీ కండరాలను సడలిస్తుంది, దీర్ఘకాలం దగ్గరగా పని చేయడంవలన కలిగే అలసటను తేలికపరుస్తుంది. కొన్ని సమయాలలో, పొడికంటి తేలికపాటి లక్షణాలను తగ్గించడానికి ప్రిజర్వేటివ్ లేని లూబ్రికేటింగ్ కంటి మందుచుక్కలను ఉపయోగించవచ్చు. అంతేకాక, సాధారణంగా కళ్ళద్దాలు ఉపయోగించే పిల్లలు వాటిని తప్పకుండా పెట్టుకోవాలి.
అంతేకాక, స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి వివిధ మార్గాలను టీచర్లు అన్వేషించవచ్చు. ప్రతిరోజూ, ఆన్ లైన్ బోధనా షెడ్యూల్ నిలిపివేస్తూ, కనీసం ఒక సెషన్ శారీరక వ్యాయామం, యోగా, నృత్యం లేదా వర్చ్యువల్ వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ఇది పిల్లలకు సరదాయేకాకుండా ఆరోగ్యకరం కూడా. హోంవర్కుకోసం వారు వారి పాఠ్యపుస్తకాలు మరియు నోటుబుక్కులు ఉపయోగించేటట్లు ప్రోత్సహించాలి, అన్ని డిజిటల్ పరికరాలను నివారించాలి.
తల్లితండ్రులు మొబైల్ ఫోన్లు, టీవీనుంచి వీలైనంత దూరంగా ఉండటంద్వారా ఒక మంచి ఉదాహరణగా నిలవాలి. వారు తీరిక సమయంలో అన్యోన్యంగా ఉండటం, ఆటలు ఆడటం మరియు కుటుంబ సభ్యులతో చేరువగా ఉండేటట్లు ప్రోత్సహిస్తూ, ‘నాణ్యమైన కుటుంబ సమయం’ పెంపొందించవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉపయోగం కేవలం తరగతులకు మరియు నేర్చుకోవడానికని నొక్కి చెప్పాలి. ఈ కొత్త పద్ధతులను అంగీకరించడం, వాటికి అలవాటు పడటం మరియు వాటిని సమర్థవంతంగా అనుసరించడం పిల్లలకు నేర్పించాలి.
పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కుటుంబాలు, టీచర్లు మరియు డాక్టర్ల సమిష్టి బాధ్యత. మారుతున్న సమయాలకు అనుగుణంగా మారడం, సాంకేతికతను మన ప్రయోజనానికై వాడుకుంటూ భద్రతా చర్యలను పాటించడం మన పిల్లలకు మెరుగైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వగలదు.