తండ్రికి ఆప్తుడు… బిడ్డలకు ప్రత్యర్థిగా మారాడు. నిజమే జనరేషన్ మార్పు అనుకోవాల్సిందే. కానీ రాజకీయాల్లో మాత్రం అదే వెంటాడే శత్రువు అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలంటారు. భూమా వారసురాలు అఖిలప్రియకు మాత్రం ఈ విషయం తెలిసినట్టు లేదు. తల్లిదండ్రులు నమ్మిన బంధువును దూరం చేసుకుంటుంది. ఇదంతా స్వయంకృతమా.. లేకపోతే రాజకీయంగా తనకు పోటీ వస్తాడనే భయమా! ఏమో ఎవరు ఎలాగైనా విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం.. రాజకీయాల్లో గ్రూపిజం రెండూ ఒక్కటే. ఈ రెండూ కలబోసిన ఆళ్లగడ్డ, నంధ్యాలకు భూమా కుటుంబం అన్నీతానై నడిపించారు. నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల మరణంతో వారసత్వం అందిపుచ్చుకున్న అఖిలప్రియ టీడీపీ పంచన చేరి కొద్ది సమయంలోనే మంత్రి స్థాయికి ఎదిగారు. ఆ తరువాత భార్గవ్ అనే వ్యక్తితో వివాహం.. పైగా అతడు ఏపీ ఆజీ డీజీపీ నండూరి సాంబశివరావు బంధువు కూడా. ఆ తరువాత మామూలు తతంగమే.. భార్య అధికారం.. భర్త పెత్తనం అన్నట్టు అన్నింటా తానై భార్గవ్ చక్రం తిప్పాడు. 2019 సార్వత్రిక ఎన్నికలు వైసీపీ ఘన విజయం. టీడీపీ పరాజయం.. ఆ జాబితాలో భూమా కుటుంబం చేరింది. ఆ తరువాత అసలు పోటీ మొదలైంది. పాత తప్పులన్నీ వైసీపీ వెలికితీసే పనిలో పడింది. ఇటువంటి సమయంలోనే సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ అనేంతగా మారింది. సుబ్బారెడ్డి ఎదుగుదల అఖిలకు నచ్చలేదా.. భార్గవ్‌కు ఇష్టంలేదా అనే చర్చ జరుగుతున్న సమయంలోనే.. సుబ్బారెడ్డిపై మర్డర్‌ప్లాన్ చేశారంటూ ఓ సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనివెనుక భార్గవ్ సహాయకుడు ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో ఇదే తేల్చారు. ఇదంతా నిజమేనా… వైసీపీ ఆడుతున్న డ్రామానా అనే గుసగుసలూ లేకపోలేదు. దీనిపై స్వయంగా సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. అఖిలప్రియ గురించి చెప్పారు. భార్గవ్‌తో పెళ్లి అనగానే భూమా నాగిరెడ్డితో తాను వద్దని చెప్పానంటూ వివరించారు. అయితే అఖిలప్రియ మాత్రం తాను అతడినే పెళ్లిచేసుకుంటానంటూ మొండిపట్టు పట్టినట్టు గతాన్ని గుర్తుచేసుకున్నారు. దీనివెనుక అఖిలప్రియ ఉందా! లేదా అనేదానిపై పోలీసులే నిగ్గుతేల్చాలంటున్నాడు. టీడీపీ నాయకత్వం అఖిలప్రియను దూరంగా ఉంచాలనే డిమాండ్
కూడా ఉంచాడు. వైసీపీ కోరుకున్నది ఇదే.. టీడీపీ అనుకునేది కూడా అదే. కాబట్టి.. రెంటికి చెడ్డ రేవడిగా అఖిల ను ఏకాకి చేయాలనే రాజకీయ వ్యూహంలో పూర్తిగా చిక్కుకుందనేది విశ్లేషకుల వాదన.



