ఊపిరి అందక ఒక భర్త. .. నాన్న ఇంకా నా వల్ల కాదంటూ చివరిసారి వీడ్కోలు పలికిన కుమారుడు. అన్నా ఎందుకీ దవాఖానకు తోలకొచ్చారు. ఇంట్లో ఉంటే హాయిగా ఉండేవాడినంటూ ప్రాణాలు పోయే పరిస్థితిలో ఓ జర్నలిస్టు. రోడ్డు ప్రమాదం .. ఆపై కరోనా సోకిందంటూ కోమాలో ఉన్న కొడుకుని పట్టించుకోపోతే. . ఓ కన్నతండ్రి పడిన ఆవేదన. ఇవన్నీ కరోనా బాధితుల పడుతున్న కష్టాలు. ఎక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ తారాస్థాయికి చేరింది. నాలుగు రోజులు ఉంచి పది లక్షలరూపాయల బిల్లులు వేస్తున్న ఆసుపత్రులున్నాయి. విజయవాడలో రమేష్ హాస్పిటల్ మరింత బరితెగించి ఓ స్టార్ హోటల్‌ను అద్దెకు తీసుకుని దర్జాగా రోగులకు చికిత్స ఇస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా 11 మంది మరణించారు. మరో 10 మంది తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై విచారణలు, దర్యాప్తులు ఎన్ని జరిగినా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ పెద్దలను తప్పిస్తారు. పొట్టకూటి కోసం అక్కడ పనిచేసే ఉద్యోగులను బలిచేస్తారనేది జగమెరిగిన సత్యం.
ఒకాయన పారాసిట్మాల్ వేసుకుంటే చాలంటాడు. మరొకరేమో అబ్బే.. అసలు అది మన రాష్ట్రంలోకి రానే రాదంటాడు. మరో మంత్రి వర్యుడు హరితహారం మొక్కలు పెంచితే కరోనా పరార్ అంటూ ఏవో చెబుతాడు. ఇలా.. ఏపీ, తెలంగాణల్లో కొవిడ్19 పాజిటివ్ కేసులపై నేతల తీరు. కరోనా వైరస్ ప్రాణాలు బలితీసుకుంటున్నా ఎవ్వరికీ పట్టట్లేదు. డబ్బున్నోడు కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రోగం బయటపడితే వెలివేస్తారనే భయంతో పేదోడు కషాయం తాగి పొద్దు పుచ్చుకుంటున్నాడు. భారం పై వాడిపై వేసి తగ్గితే ఇంటికి.. లేకపోతే కాటికి అనేంత వరకూ చేరారు. ఒక సాధారణ వ్యక్తి కొవిడ్ భారీన పడితే సర్కారు ఆసుపత్రికి పోవాలంటే భయపడుతున్నాడు. కార్పోరేట్ ఆసుపత్రికి పోలేక మౌనంగా ఉండిపోతున్నాడు. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా అధికార యంత్రంగా తీరు మారట్లేదు. ఇద్దరు సీఎంలు మొదట లైట్‌గా తీసుకున్న క్రమంగా దీని సీరియస్‌నెస్ గుర్తించారు. కానీ గ్రౌండ్‌లెవల్లో అధికార యంత్రాంగం మాత్రం ఏవో నివేదికలు ఇచ్చి ప్రభుత్వానికి ఫీల్‌గుడ్ అనే మార్కులు కొట్టేస్తున్నారు. తాజాగా విజయవాడలో స్వర్ణప్యాలెస్‌లో జరిగిన దారుణంతో పాలకులు కళ్లుతెరిస్తే
కనీసం మానవత్వం చాటుకున్నవారవుతారంటున్నారు తెలుగు ప్రజలు.