ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్టణం ఖాయమైంది. అగస్టు 15 న అక్కడే జాతీయజెండా ఎగురవేసి లాంఛనంగా పాలన కూడా మొదలుపెట్టబోతున్నారు. మరి ఇప్పుడు రాజదాని పరిధిలోని ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు. రాజీనామా చేసి ప్రజలకు సంఘీభావం చెబుతారా! ముఖం చాటేసి మూడున్నరేళ్లపాటు కనిపించకుండా మాయమవుతారా! దాదాపు ఐదేళ్లపాటు అమరావతి రాజధానిగా 29 గ్రామాల రైతుల నుంచి 34000 ఎకరాల భూములు సేకరించారు. అరచేతిలో స్వర్గం చూపారు. ప్లాట్లు అన్నారు. బహుళ అంతస్తుల భవనాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కోట్లు పలికాయి. భవిష్యత్‌పై ఆశతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు చేసి మరీ భూములు కొన్నారు. ప్లాట్లు వేశారు. రాజధాని తరలింపుతో ఇప్పుడవన్నీ ఎందుకు పనికిరాని చిల్లిగవ్వగా మారిపోయాయి. ఎంతోమంది అప్పులపాలయ్యారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, విజయవాడ, మచలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల ఎంపీలు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇది నిజంగానే గడ్డుకాలం. రెండు జిల్లాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారా! రాజధానికి ప్రజలకు న్యాయం జరిగేలా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎటుపాలుపోకుండా ఉన్నారట. ఎందుకంటే.. వారి రాజకీయ భవిష్యత్‌పై తప్పకుండా రాజధాని తరలింపు ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొందట. ఇటీవలే నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అమరావతి రాజధాని రైతుల వద్దకెళ్లి సంఘీభావం తెలిపారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం జనాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అసలు రాజధాని పరిధిలోని గ్రామాల్లో పర్యటనకూ ఈ ఇద్దరూ డుమ్మా కొడుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరోనా భయం, రాజధాని రైతుల నుంచి పెల్లుబుకే వ్యతిరేకతను గమనించి వెనుకంజ వేస్తున్నారట. ఏమైనా.. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్‌ను వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత వరకూ గౌరవిస్తారనేది తెలియాల్సి ఉంది.
పార్టీ కి వ్యతిరేకంగా వెళ్తారా?