జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోసారి తెరమీదకు వచ్చారు. కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్న నేత ముద్రగడ పద్మనాభం పక్కకు తప్పుకున్నారు. 2014లో కాపులను బీసీల్లోకి చేర్చుతామని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ.. గెలిచాక తూచ్ కమీషన్‌లో ఏటా వెయ్యికోట్లు ఇస్తామంటూ కేవలం వంద కోట్లకే సరిపుచ్చింది. 2019లో వైసీపీ అదినేత జగన్ మోహన్‌రెడ్డి గెలిచారు. అంతకముందు తాను కాపు రిజర్వేషన్‌పై ఇచ్చిన హామీ నెరవేర్చటం కష్టమంటే చెప్పారు. రాజ్యాంగ సవరణతో అధిసాధ్యమంటూ కొత్త మెలికపెట్టారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో టీడీపీ కాపు నేతలు ముద్రగడపై
విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ సర్కారు పట్ల అనుకూలంగా ఉన్నారని అందుకే కాపు ఉద్యమం గురించి మాట్లాడటంలేదంటూ ఆరోపణలు చేశారు. వరుసగా విమర్శల దాడి పెరగటంతో చివరిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖరాశారు. అనంతరం కాపులకూ తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు తేల్చిచెప్పారు. దీనివెనుక కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొందరు ఆడిన పన్నాగంగా గుసగుసలూ లేకపోలేదు. కాపు నేతల్లో కొందరికి ఉద్యమ బాధ్యతలు చేపట్టాలనే ఉబలాటమే దీనికి కారణమంటున్నారు. నీతి, నిజాయతీలకు మారుపేరుగా ఉన్న ముద్రగడ పై అభాండాలు కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలో తునివద్ద జరిగిన ఘోరసంఘటకు ముద్రగడనే బాధ్యుడిని చేశారు. దీనివెనుక చీకట్లో దాగిన వైరిమూక మాత్రం మాయమైంది. వాస్తవానికి పక్కా ప్రణాళిక, ఉద్యమం నడిపే తీరులో తలెత్తుతున్న లోపాలు కూడా వైఫల్యానికి కారణమవుతున్నాయి. బలమైన సామాజికవర్గం.. కోటిన్నర మంది జనాభా ఉన్న.. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో కాపునేతలు నిత్యం విఫలమవుతూనే ఉన్నారు. వంగవీటి మోహనరంగా తరువాత కాపునాడును అదే స్థాయిలో నిర్వహించాలని ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ముద్రగడ కూడా కాడి పడేయటంతో తరువాత నాయకత్వం ఎవరు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నా.. వాళ్లలో కొందరు చిల్లర రాజకీయాలతో కమీషన్లు పొందే బ్యాచ్ అంటూ కాపు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇటువంటి క్లిష్టమైన వేళ పవన్ కళ్యాణ్ పేరు కాపు సామాజికవర్గంలో చక్కర్లు కొడుతుంది. పవన్ కాపు బీసీ రిజర్వేషన్ ఉద్యమ బాధ్యతలు చేపడితే రసవత్తరంగా ఉంటుందని.. కాపులను ఏకతాటిపైకి తీసుకురాగలరనే నమ్మకం కూడా వారిలో ఉంది. అయితే పవన్ కేవలం కాపు వర్గ నేతగా పేరుబడితే మిగిలిన సామాజికవర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బీసీలు. కానీ.. బీసీలకు అన్యాయం జరగకుండా.. రాజ్యాంగబద్ధంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చే పద్ధతిని పరిశీలించవచ్చంటూ పలుమార్లు పవన్ రెండు ప్రభుత్వాలకూ సూచించారు. కానీ.. మరి రాజకీయ వ్యూహమో.. దీనివెనుక ఏదైనా మంత్రాంగం దాగుందో.. రాజ్యాంగ సవరణ అంత తేలిక కాదనే భయమో.. కాపు రిజర్వేషన్ గురించి ఏ ప్రభుత్వాలు మాట్లాడే సాహసం చేయట్లేదు.