కొవాక్సిన్.. భారత్ బయోటెక్- ఐసీఎంఆర్ కలసి తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్. ఇది యావత్ భారతానికే కాదు.. ప్రపంచానికి కూడా శుభవార్తే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 110 పరిశోధనలు ఈ వ్యాక్సిన్ కోసం జరుగుతున్నాయి. అమెరికా, చైనా ముందంజలోనే ఉన్నాయి. చైనా ఇప్పటికే ఫేజ్01లో క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమైన వ్యాక్సిన్ డోసులను పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అదేనండీ తమ దేశ సైన్యానికి ఇచ్చేపనిలో ఉంది. సరిహద్దు వివాదంతో భారత్ తో తలపడే అవకాశాలతో వ్యాక్సిన్‌ను ముందుగా సైనికులకు ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు భారతదేశంలో మన తెలుగు వ్యక్తి ఎల్లా కృష్ణ నెలకొల్పిన సంస్థ భారత్ బయోటిక్ నుంచి అగస్టు 15న వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు దేశంలోని 12 ఆసుపత్రులను మానవులపై ప్రయోగాలకు ఎంపిక చేశారు. వాటిలో ఏపీ, తెలంగాణలో రెండు ఆసుపత్రులున్నాయి. హైదరాబాద్ లోని నిమ్స్, విశాఖలోని కేవీకేకు అవకాశం దక్కింది. ఇక్కడ రెండు ఫేజ్‌ల్లో క్లినికల్ ట్రయల్స్ జరుపుతారు. ఈ నెల 7 నుంచి నిమ్స్‌లో మనుషులపై ప్రయోగాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు కూడా. ఇంతకీ వీరిపై ఎలా పరీక్షలు చేస్తారనే సందేహం కూడా ఉంటుంది. మొదటగా క్లినికల్ ట్రయల్స్ ఎలా జరపాలనే అంశాన్ని ఎథికల్ కమిటీలో చర్చిస్తారు. అక్కడ మనుషులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యలను రూపొందిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా వైద్యబృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక.. క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదం తెలిపిన మహిళలు/ పురుషులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అన్నిరకాలుగా ఫిట్‌గా ఉన్నారని నిర్ణారణకు వచ్చాక ఒకరోజు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఆ తరువాత భారత్ బయోటిక్ పంపిన మూడు రకాల వ్యాక్సిన్‌లను క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి ఇస్తారు.
వ్యాక్సిన్ ఇవ్వటానికి ముందు.. ఆ తరువాత వారిలో వచ్చిన మార్పులను అబ్జర్వ్ చేస్తారు. ఇలా రెండ్రోజుల పాటు వారిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవని పూర్తిగా నిర్ధారించుకున్నాక.. వారిని స్వస్థలాలకు పంపుతారు. దాదాపు 14 రోజుల పాటు
ప్రతి రోజూ వారి ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకుంటూ రికార్డు చేస్తారు. వారిలో ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేస్తారు. కరోనా వ్యాధిని ఎదిరించగల రోగనిరోధకశక్తి అలవడుతుందా లేదా అని తెలుసుకోవటమే దీని ముఖ్యోద్దేశం. 24 తరువాత రెండో దశలో అంతకుముందు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి మొదటి దశలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసేజ్‌ను మరోసారి ఇస్తారు. మళ్లీ 14 రోజుల పాటు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఇలా 28 రోజులపాటు ఫేజ్01, ఫేజ్02లో మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతాయి. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు
సానుకూల ఫలితాలిచ్చాయి. ఇప్పుడు మనుషులపై చేపట్టబోయే ప్రయోగాలు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని ఐసీఎంఆర్-భారత్ బయోటిక్ అంచనా వేస్తున్నాయి. ఈ 28 రోజులు చాలా కీలకం.. ఇటు వైద్యులు, అటు పరిశోధకులతోపాటు.. మానవాళిని వైరస్ భారీనుంచి కాపాడేందుకు ప్రయోగాలకు ముందుకు వచ్చిన వాలంటీర్లకూ ఇది సవాల్. ప్రాణాలకు తెగించి పరిశోధనకు మేం రెడీ అంటూ వేలాది మంది ముందుకురావటం శుభపరిణామం అంటున్నారు వైద్యులు. అయితే.. క్లినికల్ ప్రయోగాలకూ ఓ లెక్కుంది. 30-60 సంవత్సరాల లోపు.. ఆరోగ్యవంతులు మాత్రమే అర్హులు. ఐసీఎంఆర్ నిర్వహించే వైద్యపరీక్షల్లో పూర్తి ఫిట్‌నెస్‌గా గుర్తించిన వారు మాత్రమే ప్రయోగాలకు తీసుకుంటారు.