భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్ధం పుచ్చుకోబుతున్నారోచ్. దాదాపు ఆరేడు నెలలుగా చక్కర్లు కొడుతున్న వార్త. అప్పట్లో పుకార్లు ఎక్కువ కావటంతో గంటా వివరణ ఇచ్చారు. అదంతా తూచ్ అంటూ కొట్టిపారేశారు. మరోసారి కొద్దిరోజులుగా గంటా ఫ్యాన్ కిందకు వస్తున్నారంటూ హల్‌చల్ చేస్తోంది. దీనిపై గంటా కూడా ఎటువంటి వివరణ, ఖండన ఇవ్వకపోవంతో నిజమే అనే భావన కలుగుతోంది. ఇటువంటి సమయంలోనే. వైసీపీ కార్యకర్తలు.. బాబోయ్ గంటా మాకొద్దంటూ విశాఖతీరంలో ధర్నాలు కూడా చేశారు. వాస్తవానికి గంటా వర్సెస్ అవంతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ కాపు వర్గానికి చెందిన నేతలే అయినా పాము-ముంగిస మాదిరిగా కోట్లాట మాత్రం నిత్యం జరుగుతూనే ఉంది. దీనివెనుక వాస్తవాల జోలికి వెళ్లకుండా అసలు గంటా సంగతి చూద్దాం.. 1999లో తొలిసారి ఎంపీగా బరిలోకి దిగి నెగ్గారు. ఆ తరువాత టీడీపీ నుంచి 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. అనంతర పరిణామాల్లో పీఆర్ పీను కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో సీఎంగా కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2014లో టీడీపీలోకి చేరి మళ్లీ మంత్రయ్యారు. అప్పట్లోనే విశాఖ చుట్టూ భూముల పందేరంలో గంటా పేరు మోగింది. ఆనాటి మంత్రి నారాయణ వియ్యంకుడు కావటంతో భూ దోపిడీ భారీగానే జరిగిందనే ఆరోపణలున్నాయి. భీమిలి చుట్టూ అక్రమ భూ దందాపై వైసీపీ కూడా దృష్టిసారించింది. సిట్ ద్వారా దర్యాప్తు చేస్తుంది కూడా.
ఓ వైపు మాజీ మంత్రులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డివివిధ కేసుల్లో అరెస్టయ్యారు. తరువాత అరెస్ట్ కాబోయే టీడీపీ నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు అంటూ పుకార్లు వచ్చాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ ఏకంగా గంటా అరెస్ట్ ఖాయమంటూ సవాల్ విసిరారు. దీంతో ఉలికిపాటుకు గురైన గంటా.. జగన్‌తో మంతనాలు జరిపినట్టుగా కూడా పుకార్లు షికారు చేశాయి. ఇది నిజమా ! కాదా ! అనేది పక్కనబెడితే.. గంటా వైసీపీలోకి రావటం వల్ల మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బోనస్ అనే ప్రచారమూ లేకపోలేదు. ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటా ఆడుతున్న దోబూచులాట అవంతికి కాస్త ఇబ్బందిగా మారిందట.