అమరావతి రాజధాని తరలింపుపై రాజకీయ వేడి మొదలైంది. అటు అధికార వైసీపీ తాము తగ్గే ప్రసక్తే లేదంటోంది. మూడు రాజధానులు అభివృద్ధి కోసమేనంటూ కొత్తపాట పాడుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయం.. అద్భుతం.. అమోఘమంటూ కీర్తిస్తోంది. జనసేన, టీడీపీ మాత్రం జగన్ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నాయి. నాడు విపక్షంలో ఉన్నపుడు అమరావతి కి మద్దతు పలికి ఇప్పుడు ఇలా అడ్డంతిరగటాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం నిమిషంలో పనంటూ తాము ఎప్పుడైనా రెఢీ అంటూ సంకేతాలు పంపారు. వేలాది ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల కడపుకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంపై మండిపడ్డారు. 48 గంటలు సమయం ఇస్తున్నట్టుగా అల్టిమేటం జారీచేశారు చంద్రబాబు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాజధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీను రద్దు చేసి మరోసారి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తాము రాజధాని గురించి మాట్లాడబోమన్నారు.
ఇటువంటి క్లిష్టమైన సమయంలో వైసీపీకు చెందిన గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ నోరుమెదపలేదు. కనీసం మంగళగిరి, తాడికొండకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనే పుకార్లు లేకపోలేదు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలే ఇలా ముఖం చాటేస్తుంటే.. మిగిలిన నేతల సంగతి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏమైనా.. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ఇది జీవన్మరణ సమస్యగా మారిందనే వాదన లేకపోలేదు. మరి ఈ రెండు జిల్లాల ప్రజల అబీష్ఠానికి అనుగుణంగా రాజీనామా చేస్తారా! లేకపోతే.. తమ అధినేత నిర్ణయానికి కట్టుబడి మౌనంగా ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.