జేసీ బ్ర‌ద‌ర్స్‌.. బెదుర్స్‌!

నోరా.. తేకే.. వీపుకు చేటు అనే సామెత‌. ఏ స్థాయిలో ఉన్న కాస్త త‌గ్గి ఉండ‌టం త‌ప్పేం కాద‌నలేని నిజం. అబ్బ‌.. ఇప్పుడెందుకీ సుత్తి అనుకుంటున్నారా! అక్క‌డ‌కే వ‌స్తున్నా.. అనంత‌పురం అంటే గుర్తుకొచ్చే పేర్ల‌లో జేసీ బ్ర‌ద‌ర్స్ కూడా ఉంటారు. రాజ‌కీయంగా.. ఆర్ధికంగా వారి బ‌లం.. బ‌ల‌గం. అబ్బో అనాల్సిందే. ఖరీదైన కారు మార్కెట్‌లోకి వ‌స్తే.. మొద‌ట చేరేది కూడా జేసీ సోద‌రుల ఇంటికేన‌ట‌. అంత‌టి బ‌ల‌సంప‌న్నులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. జేసీ దివాక‌ర్‌రెడ్డి అదేనండీ మ‌న మాజీ ఎంపీ సారు. ఏం మాట్లాడ‌తారో.. ఎందుకు స్పందిస్తార‌నేది అంతుబ‌ట్ట‌ని ప్ర‌శ్న‌. నాడు వైఎస్ హ‌యాంలోనూ ఆయ‌న‌పై దిక్కార‌స్వ‌రం వినిపించారు.ఆ త‌రువాత పార్టీ మారి ప‌సుపు కండువా క‌ప్పుకుని ఎంపీ అయ్యాక‌.. చంద్ర‌బాబునూ తూల‌నాడారు. కాసేపు జ‌గ‌న్ మావాడేనంటారు. అబ్బే.. అతడితో వేగ‌లేమంటారు. ఏమైనా.. నోటి కి ప‌నిచెబుతూ క‌ష్టాలు కొనితెచ్చుకుంటూనే ఉన్నారు. ద‌శాబ్దాలుగా సాగుతున్న త‌మ ఆట‌లు.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో కుద‌ర‌వ‌నే విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా జైలు ఊచ‌లు.. మ‌ళ్లీ కేసులంటూ ఠాణాల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితికి చేరారు. నిజానికి.. ఇప్పుడు క‌రోనా విజృంభిస్తుంది. సీమ జిల్లాల్లోనూ కేసులు విస్త‌రిస్తున్నాయి. ఇటువంటి స‌మ‌యంలోనే న‌కిలీ డాక్యుమెంట్స్‌కేసులో 55 రోజుల పాటు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, త‌న‌యుడు ఆస్మిత్‌రెడ్డి క‌డ‌ప జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఊరేగింపు కోసం భారీగా జ‌నం చేరారు. ఇది మంచిదికాదంటూ వాహ‌నాల‌ను ఆపిన తాడిప‌త్రి సీఐ దేవేందర్‌పై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. అంతే.. అస‌లే మాంచి కాక‌మీదున్న‌పోలీసులు ఊరుకుంటారా! మ‌ళ్లీ కేసులంటూ.. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన అయ్యా కొడుకుల‌ను మ‌ళ్లీ జైలు బాట‌ప‌ట్టించారు. దేవేంద‌ర్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశార‌న్న‌మాట‌. అందుకేనేమో.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో డైలాగ్ మాదిరిగా ఎక్క‌డ నెగ్గాలో కాదురా.. ఎక్క‌డ త‌గ్గాలో కూడా తెలిసినోడే గొప్పోడంటారు. మ‌రి ఈ లెక్క‌న‌.. జేసీ బ్ర‌ద‌ర్స్ ను ఎలా లెక్క‌లోకి తీసుకోవాల‌ని మాత్రం అడ‌క్కండీ. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాత్రం ఇదంతా రాజ‌కీయ‌కక్ష‌తోనే చేస్తున్నారంటూ ఆరోపించారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌పుడు త‌న‌ను 11 రోజులు జైల్లో ఉంచార‌నే విష‌యాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అదే బాట‌లో జ‌గ‌న్ కూడా త‌మ‌పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఇలా చేస్తున్నార‌న్నారు. వైసీపీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తే వెళ‌తా. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉంచితే స్వ‌యంగా వెళ్లి జ‌గ‌న్‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రిస్తానంటూ అన్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట‌ల ఆంత‌ర్యం కూడా అంతుబ‌ట్ట‌కుండా ఉంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here