కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం. చీలికలుగా విడిపోయి ఎవరికి వారే నాయకత్వపోరులో ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తూ వస్తున్నారు. సుమారు కోటిన్నర మంది జనాభా ఉన్న కాపులు బ్రిటీష్ హయాం నుంచే బీసీలుగా పరిగణలో ఉన్నారనే ప్రచారమూ ఉంది. ఉత్తరాంధ్రలో తూర్పుకాపులుగా బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు. తెలంగాణలోనూ మున్నూరుకాపులూ బీసీలే. ఏపీలోని కోస్తా కాపులు, సీమలోని బలిజలు మాత్రం ఏళ్లతరబడి ఓసీలుగానే కాలం వెళ్లదీస్తున్నారు. దాదాపు 70-80శాతం కాపు సామాజికవర్గంలో పేదరికానికి దిగువన ఉన్నవారే. ఆటోమొబైల్, వ్యవసాయం, భవననిర్మాణ, రక్షణదళాల్లో పనిచేస్తున్నవారే అధికం. నాటి సీఎం సంజీవరెడ్డి నుంచి ఇప్పటి వరకూ కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ అధికారం చేపట్టిన పాలకులు ఆ తరువాత న్యాయస్థానాల కేసులు, తీర్పులను చూపుతూ ఐదేళ్లు పబ్బం గడుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా, ఉన్నతహోదాలో ఉన్న కాపు వర్గ ప్రముఖులు కూడా ఆ నాడు అధికార పార్టీలకు తొత్తులుగానే వ్యవహరించారు. 2014 ఎన్నికల స్టంట్‌లో భాగంగా చంద్రబాబు తాను గెలిస్తే కాపులకు బీసీ రిజర్వేషన్ అంటూ ఆశచూపారు. నిజమని భావించి కాపులు కూడా అటువైపు మొగ్గుచూపారు. గెలిచిన తరువాత డిప్యూటీ సీఎంగా చినరాజప్ప, మంత్రులుగా నారాయణ, గంటా వంటి కాపు వర్గ నేతలకే బిస్కెట్లు వేశారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కాపు రిజర్వేషన్‌పై సీఎంను నిలదీసే సాహసం చేయలేకపోయారు. కాపుల కార్పోరేషన్ పేరిట నాలుగు మెతుకులు విసిరి వదిలేశారు.
ఏటా రూ.1000 కోట్లు అని ప్రగల్భాలు పలికి రూ.100 కోట్లు విదిల్చారు. అక్కడా అవినీతి భాగోతాలే జరిగాయి. 2019లో జగన్ అవకాశాన్ని బట్టి కాపుల రిజర్వేషన్ అంటూనే తన వల్లకాదని.. కేంద్రం చేతిలో ఉందంటూ చేతులెత్తేశారు. ఇప్పుడు ఆయన సర్కారు ఉంది. మరోవైపు.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు కొందరు ప్రతిసారీ బీసీలను ఎగదోస్తుంటారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే.. బీసీలకు అన్యాయం జరుగుతుందంటారు. కానీ.. తమిళనాడు, తెలంగాణల్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినపుడు బీసీలు అడ్డుపడకపోవటం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. కేవలం కాపులకు రిజర్వేషన్ అనగానే పాలకులకు చట్టాలు గుర్తుకురావటం కాపు వర్గ నేతలూ గుర్తింలేకపోతున్నారు. దశాబ్దాలుగా వారికే గులాం కొడుతూ కాలం వెళ్లదీస్తన్నారు.
ముద్రగడ పద్మనాభం.. వ్యక్తిగా సమర్థుడే. కానీ.. కాపు ఉద్యమాన్ని నడపటంలో అందర్నీ కలుపుకోవటంలో విఫలమయ్యారు. నాయకత్వలోపం వల్ల ఉవ్వెత్తున ఎగసిన కాపు రిజర్వేషన్ ఉద్యమం తుని ఘటనతో చల్లారింది. దీనికి కారకులెవరు? తెర వెనుక నుంచి రైలును తగులబెట్టి రాజకీయం ఎవరు చేశారనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత దాన్ని సాకుగా చూపుతూ నాటి ప్రభుత్వ శాంతిభద్రత పరిరక్షణంటూ ముద్రగడ కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. అప్పుడూ ఏ ఒక్క కాపు వర్గ మంత్రులూ నోరుమెదిపే సాహసం చేయలేకపోయారు. ముద్రగడ అంటే.. జగన్‌కు అనుకూలమనే విమర్శలతో పద్మనాభం అలిగారు. తూచ్ నేనీ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానంటూ వైదొలిగారు.
ఇప్పుడు కాపులకు నాయకుడు కావాలి. ఉద్యమం నడిపేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ ఒక్కరూ ఎవరని అనుకున్నపుడు ఇప్పటి వరకూ కులాన్ని అడ్డుపెట్టుకుని దందాలు.. ఎన్నికలపుడు కాస్తో.. కూస్తో డబ్బులు దండుకున్న బ్యాచ్ కూడా ముందుకొచ్చింది. కానీ.. పరిణితి, నాయకత్వం ఉన్న వ్యక్తులు ఎవరు అనే చర్చలో వంగవీటి రాధా, పవన్ కళ్యాణ్
పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆ తరువాత వంగవీటి శంతన్‌కుమార్, దాసరి రాము తదితర పేర్లు వినిపించాయి.
ఇప్పుడు చివరకు.. నర్సాపురం మాజీ ఎంపీ.. రాజకీయ కురువృద్ధుడు.. హరిరామజోగయ్య తాను కాపు రిజర్వేషన్‌ను ముందుండి నడిపిస్తానంటూ చేయెత్తారు. 80 ఏళ్లు దాటిన వయసులో జోగయ్య ఉద్యమం ఎలా నడిపిస్తారనే ప్రశ్న కాపుల నుంచి వస్తోంది. కానీ. దీనివెనుక ఎవరో వసూల్ రాయుళ్లు ఉన్నారనే అనుమానాలు కాపుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో బీసీ నేతలతో కలసిమెలసి తిరిగిన ఓ నాయకుడు ఈ హైడ్రామాలో కీలకమనే వాదన లేకపోలేదు. పలు దఫాలుగా మంత్రిగా చేసిన సమయంలో జోగయ్య ఎందుకు నోరుమెదపలేదు. ఇప్పటి వరకూ ఎందుకు వెనుకనే ఉన్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జోగయ్య పేరు ఎందుకు వచ్చింది. కాపు సంక్షేమ సేన పేరుతో సంస్థను స్థాపించి ఉద్యమం చేపట్టేందుకు ఎవరు కారకులు? ఇదంతా ఏ పార్టీ ఆడిస్తున్న డ్రామా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ కేవలం ఆరోపణలే.. జోగయ్య స్వయంగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తారని కాపులకు నమ్మకం కలిగిన రోజున ఆయన వెంట నడిచేందుకు సిద్ధమంటున్నారు.