అబద్దంలా కనిపించే చేదునిజం. జనసేన ఏదో గాలికి కొట్టుకొచ్చిన పార్టీ.. ఎన్నాళ్లో ఉండదంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన కామెంట్స్ కేవలం వ్యక్తిగతమే కాదు. పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న రాచకీయాలకు హెచ్చరిక కూడా. ఏపీలో కుల పంచాయితీ ఇప్పుడేం కొత్తకాదు. ఇప్పటికే అధికారానికి అలవాటుపడిన వర్గాలు కిందిస్థాయి ఉన్న వారు సింహాసనంపై కూర్చునేందుకు చేసే ప్రయత్నాలను దెబ్బతీయాలనే చూస్తారు. శత్రువు… శత్రువు మిత్రుడు అన్నట్టుగానే మూడో నాయకుడిని అంచనా వేస్తారు. రాజనీతి.. రణనీతి నియమాలున్నట్టుగా రాజకీయాల్లోనూ కొన్ని విలువలుండేవి. కానీ అవన్నీ మూడు దశాబ్దాలుగా పతనం అవుతూ వస్తున్నాయి. కొత్త రాజకీయాలకు రూపమివ్వాలని వచ్చిన జయప్రకాష్‌నారాయణ్ వంటి వాళ్లు కుట్రలు, కుతంత్రాలు తాము చేయలేమంటూ గౌరవంగా తప్పుకున్నారు. సామాజికమార్పు కోసమంటూ వెండితెర నుంచి వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీను తమ వేళ్లతో తమ కళ్లు పొడుచుకున్నట్టుగానే చేశారు. ఇప్పుడు జనసేన.. ఒక్కసీటు సాధించినా.. అతడూ తూచ్ నేను అధికార పార్టీ ప్రతినిధినంటూ ప్రచారం చేసుకుంటున్నా అధినేత పవన్ తేలికగా తీసుకున్నాడు. వర్మ వంటి దర్శకుడు సినిమా తీసి పవన్ పరువు తీయాలని చూసినా చూసీచూడనట్టు వదిలేశారు. ఇవన్నీ పవన్‌ను దెబ్బతీయటానికి ప్రజల్లో చులకనగా మార్చి జనసేన పార్టీ జెండా పీకేయాలనే ప్లాన్ అంతర్గతంగా దాగుంది. దేశ ప్రయోజనాల కోసమంటూ చంద్రబాబు.. మూడున్నర దశాబ్దాల వైరం వదిలేసి హస్తం పక్కకు చేరితే ఆహా.. ఓహో అన్నారు.అదే పవన్ బీజేపీతో చేయి కలపగానే చూశారా.. అతడు సెక్యులరిస్టు కాదనే ముద్ర వేసే పనిలో పడ్డారు. జనసేనతో పొత్తు వల్ల మేం దూరమవుతున్నామనే సంకేతాన్ని పంపేందుకు బీజేపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, కామినేని శ్రీనివాస్, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరీ వంటి వారు.. మొన్న సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినపుడు ముఖం చాటేశారు. ఇదంతా జనసేనానిని బలహీనం చేయాలనే ఎత్తుగడలో చేస్తున్న రాజకీయాలే అనేది జనసైనికుల అభిప్రాయం. బీజేపీ_జనసేన కలయికతో అధికారం చేపట్టినా.. చేపట్టకపోయినా గట్టి ప్రతిపక్షంగా అయినా కొద్దికాలం బలంగా ప్రజా గొంతుకను వినిపించగలరనేది ఏపీ ప్రజల్లో ఉన్న నమ్మకం..
అందుకే నిన్నటి వరకూ గుర్తుకురాని ఏపీ ప్రత్యేకహోదాను మరోసారి తెరమీదకు తీసుకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరిగిన నరేంద్రమోదీ హవాను ఏపీను తాకకుండా ఇదో పాచికగా ప్రయోగిస్తున్నారు. ఒక దెబ్బకు రెండుపిట్టలు అన్నట్టు.. బీజేపీపై వ్యతిరేకత.. దానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన ఓటుబ్యాంకును దూరం చేయటమనే పథకరచన దాదాపు మొదలెట్టారనేది జనసేన నేతల ఆవేదన. దానిలో భాగంగానే జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను కూడా పార్టీను వీడేలా ఒత్తిడి తెస్తున్నారట కొందరు. ఆయన్ను బీజేపీలోకి తీసుకెళ్లటం ద్వారా కాషాయంలో తగ్గిన కమ్మ ప్రాభల్యాన్ని మరింత పెంచాలనేది వ్యూహమట. దీనివల్ల జనసేన కేవలం కాపులదనే కులముద్ర వేయాలనే ఎత్తుగడ కూడా ఉంది. కానీ.. ఇదంతా చిరంజీవి వద్ద అయితే చెల్లుబాటు అయింది.. తిక్క.. లెక్క రెండూ ఉన్న జనసేనాని వద్ద ఇలాంటి పప్పులు ఉడకవ్ అంటూ.. జనసైనికులు తమ నాయకుడి శక్తిపై ధీమాగా ఉండటం విశేషమే.
చిరంజీవి తన వేళ్ళతో తాను పొడుచుకోలేదు. పరిస్థితులు ఆ నాడు రాజశేఖర్ రెడ్డి పవనాలతో రోజుకోతీరుగా మారుతూ వచ్చాయి. అదీగాక చిరంజీవి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, మృదు స్వభావులు నేటి రాజాకీయాల్లో మనగలరా? ఆరోజు ఆయన నిర్ణయం సబబే కావొచ్చు…నేటి రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే, అంత ఆరోగ్యంగా వుంటారు ప్రజలు…