అక్కడ అందరూ నాయకులే. ఎవరి పెత్తనం వారిది. హైకమాండ్ ఆశీర్వచనాలు అందరికీ ఉన్నాయంటూ పొంగిపోతుంటారు. అధికారం వస్తే తామే ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇదీ వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ దుస్థితి. జాతీయస్థాయిలో నడిపించే నాయకుడు లేకపోవటంతో కర్ణాటక నుంచి బిహార్ వరకూ ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ వస్తోంది. పదేళ్లపాటు యూపీఏ సర్కార్‌తో సుస్థిరంగా నిలబడాల్సిన కాంగ్రెస్ ఏడేళ్లుగా ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. తెలంగాణలో గెలుపు అవకాశం వచ్చినా చేతులారా చేజార్చుకుంది. 2018లో ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ ఎస్‌కు మధ్య పోటీ ఉంటుందనుకున్నారు. కానీ. మధ్యలో తెలుగుదేశం పార్టీ పొత్తు పుణ్యమాంటూ దెబ్బతిన్నారు. చంద్రబాబునాయుడు ప్రచారానికి రావటంతో టీఆర్ ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌తో దూసుకెళ్లింది. కాంగ్రెస్ బిక్కమొహం వేయాల్సి వచ్చింది. 2019లోనూ అదే సేమ్ రిపీట్.
2020 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ నాలుగైదు స్థానాల్లో ఉందనే భావించారు. టీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌కు పోటీగానే భావించారు. కానీ.. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరవయ్యారు. ఎవరికి వారే నేతలు అన్నట్టుగా.. నడుస్తున్నారు. గాంధీభవన్ సాక్షిగా పోట్లాటలు.. గిల్లికజ్జాలు ఇవన్నీ పార్టీ పరవును బజార్నపడేశాయి. ఉత్తమ్ నాయకత్వాన్ని దెబ్బతీయాలని కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్‌రెడ్డి వస్తే పోటీ అని భావించే వీహెచ్, పొన్నాల వంటి సీనియర్లు. ఇలా కాంగ్రెస్ ఖేల్‌ను ముగించారు. పరోక్షంగా బీజేపీ ఎదుగుదలకు దారులు వేశారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకెంతగా కాంగ్రెస్ పతనం అవుతుందనేది ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళన.