ట్రిపుల్ ఆర్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. అదేనండీ నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో చేసిన రచ్చకు ఏపీ సర్కార్ చరమగీతం పాడనుందా! ఏడాదిపాటు ఎంపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై జగన్ ప్రభుత్వం గట్టిగానే దెబ్బకొట్టిందా! అంటే ఔననే సమాధానం వస్తుంది. నిజమే.. ఎంపీగా రఘురామకృష్ణంరాజు గెలిచింది వైసీపీ జెండా మీదనే అనేది జగమెరిగిన సత్యం. ఎంపీ అయ్యాక ఆయనలో తెలియని మార్పు వచ్చింది. జగన్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదనే అక్కసో.. విశాఖ ప్రాంతంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఎంపీ విజయసాయిరెడ్డిపై అక్కసో కానీ.. రాజు గారు జగన్ రెడ్డి అంటూ.. తీవ్రంగా విమర్శలు చేయసాగారు. హిందుత్వం పట్ల వ్యతిరేకంగా ఉండే క్రైస్తవం, జగన్ మోహన్‌రెడ్డి పట్ల రఘురామరాజు చాలా తీవ్రమైన ఆరోపణలు గుప్పించేవారు. టీవీ5, ఏబీఎన్ ఛానళ్ల ద్వారా ప్రతిరోజూ ఏదోక సమయంలో ప్రత్యేక బులెటిన్ ద్వారా జగన్ సర్కారును దుయ్యబట్టడం ఆనవాయితీగా మారింది. ఒకానొక దశలో తనకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందంటూ కేంద్రం ద్వారా సీఐఎస్ ఎఫ్ పోర్సు ద్వారా రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే రఘురామరాజు.. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ మోహన్‌రెడ్డిలను అవకాశం చిక్కినప్పుడల్లా తిడుతూ వస్తున్నారు. అవకాశానికి అనుగుణంగా కాపు, రెడ్డి, క్రైస్తవులను తన ప్రసంగాల్లో పేర్కొంటూ రావటం.. ఏపీ సర్కార్‌కు అవకాశంగా మారింది.
రఘురాముడు చేసిన తప్పిదాలను అవకాశంగా మలచుకుని.. దేశద్రోహ కేసు నమోదు చేసిన సీఐడీ ఏకంగా అరెస్ట్ చేసింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు తరపున లాయర్లు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా రఘురాముడుకి చుక్కెదురైంది. కేసుకు సంబంధించిన పిటీషన్ సీఐడీ కోర్టులోనే దాఖలు చేయాలంటూ హైకోర్టు ఎంపీ హౌస్ మోషన్ పిటీషన్ కొట్టిపారేశారు. ఈ లెక్కన.. సీఐడీ కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠతగా మారింది. బెయిల్ ఇస్తారా! లేకపోతే.. రిమాండ్ ఖైదీగా జైలుకు పంపుతారా! అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు సీఐడీ అధికారులు రఘురామ కృష్ణంరాజు నుంచి వివరాలు రాబడుతున్నారు. రచ్చబండ ద్వారా వివాదాస్పద కామెంట్స్ చేయటం వెనక ఎవరైనా సహకరిస్తున్నారా! అనే దానిపై సమాచారం రాబట్టారట.