ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల్లో చిన్నపాము అయినా పెద్ద కర్రతోనే కొట్టాలి అనేంత జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జ్వర లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దు. ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసే కరోనా టెస్ట్ చేయించుకోమంటున్నారు వైద్యనిపుణులు. డాక్టర్లు కూడా రోజూ వేలాది మంది కొవిడ్ పాజిటివ్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వారి అనుభవంతో చెబుతున్నమాట ఒక్కటే.. కరోనాను వీలైనంత తక్కువ సమయంలో గుర్తించాలి. అంటే.. వైరస్ శరీరంలోకి చేరిన మొదటి రెండ్రోజుల్లోనే తెలియాలి. దీనిద్వారా బాధితులకు వెంటనే వైద్యం ప్రారంభించవచ్చు. వారిలో ఏమైనా ఇతర వ్యాధులున్నట్టు గుర్తిస్తే ముందుగానే అప్రమత్తం కావచ్చు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులకు ప్రధాన కారణం.. దగ్గు, జ్వరమే కదా! అని తేలికగా వదిలేయటం.. ఆ తరువాత రోగం ముదిరాక అప్పుడు టెస్ట్‌ల కోసం పరుగులు తీయటంతో ఆలస్యమవుతుంది. అప్పటికే ఊపిరితిత్తులు, గుండెపై వైరస్ ప్రభావం చూపటం ప్రారంభిస్తుంది. ఇదంతా అంతర్గతంగా జరుగుతున్న పైకి చాలా ఆరోగ్యంగా కనబడుతుంటారు. అందుకే.. వైరస్ విస్తరిస్తున్న ఇటువంటి కీలకమైన సమయంలో.. వయసుతో సంబంధం లేకుండా.. కరోనా లక్షణాలుగా చెప్పే దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, వాసన, రుచి కోల్పోవటం వంటి లక్షణాల్లో ఏది తీవ్రంగా అనిపించినా వైద్యపరీక్ష చేయించుకోవటం మరవొద్దు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో…
ఒకవేళ వైరస్ వస్తే ఎలా చూస్తారనే అనవసరపు ఆందోళన పెట్టుకోవద్దు. ఎందుకంటే. ప్రజలు కూడా మారుతున్నారు. వైరస్‌కు గురైన వారిపట్ల ఆదరంగా మెలుగుతున్నారు. ఆప్యాయత చూపుతున్నారు. అపార్టమెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో బాధితులకు ఇరుగుపొరుగు సాయం చేస్తున్నారు కూడా..కాబట్టి మీలో లక్షణాలు కనిపిస్తే.. 104, 108, 1075 కాదంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా సరిపోతుంది.