ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డంకులు అధిగమించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సోమవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నియామకమైన నిమ్మగడ్డను వైసీపీ సర్కారు ఏకపక్షంగా తొలగించింది. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వ్యక్తిని గవర్నర్ ఆర్డినెన్స్‌తో.. ప్రభుత్వ జీవోలతో తొలగించే అధికారం లేదంటూ.. నిమ్మగడ్డ న్యాయస్థానాలను ఆశ్రయించి.. తనకు రాజ్యాంగ కల్పించిన హక్కును కాపాడుకున్నారు. దీంతో ఏపీ సర్కారు దిగిరావాల్సి తప్పలేదు. ఎట్టకేలకు మరోసారి నిమ్మగడ్డకే ఆ పదవీ బాధ్యతలు కట్టబెట్టింది. దీనిపై ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. రాగధ్వేషాలకు అతీతంగా .. రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నానంటూ నిమ్మగడ్డ స్పష్టంచేశారు.