చూడు.. ఒకవైపే చూడు. రెండోవైపు చూస్తే తట్టుకోలేవ్ .. బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు జగన్ ఆచరణలో నిరూ పిస్తు న్నారు. నీతి, అవినీతి విషయాలు పక్కనబెడితే.. శత్రువును బలహీన పరచి పోటీ లేకుండా చేసుకోవటమే రాజనీతి అంటాడు చాణక్యుడు. ఇప్పుడు ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ఫార్మూలా ఫాలో అవుతున్నట్టుగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ రాజకీయంగా వైసీపీను దెబ్బతీసేందుకు చాలా ఎత్తుగడలు వేసింది. 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఏకంగా తమ వైపునకు తిప్పుకుంది. ఆ తరువాత కేసులు.. దాడులు ఇలా చాలానే చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ముసుగులో గట్టిగానే సంపాదించారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇప్పుడు వైసీపీ వంతు.. ప్రజల్లో మద్దతు.. భారీ మెజార్టీ .. టీడీపీను బలహీన పరిచేందుకు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు చేసిన తప్పులు ఉండనే ఉన్నాయి. అవన్నీ బయటకు తీసి ఒక్కోకరికీ చుక్కలు చూపుతున్నారు. ప్రజల్లో ఏ మాత్రం సానుభూతి పెల్లుబుకకుండా పక్కాగా సాక్ష్యాలు సేకరించి మరీ అరెస్ట్ చేయటం నిజంగా అసలు సిసలైన రాజకీయమనే చెప్పాలి. టీడీపీలో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్స్ గా ముద్రపడిన అందరి తప్పులు బయటపడుతున్నాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు తమ వరుస ఎప్పడా అని టెన్షన్ పడుతున్నారట. ఆ జాబితాలో తరువాత మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. స్వయంగా వైసీపీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా ప్రకటించారు. ఈఎస్ ఐ స్కామ్‌లో పితాని ప్రమేయంగా ఏసీబీ కూపీలాగుతుంది. ఏ మాత్రం ఆధారాలు దొరికినా అంతేసంగతులు. విశాఖచుట్టూ భూముల వ్యవహారంలో గంటా పేరు ఎప్పటి నుంచి తెరమీదకు వచ్చింది.
మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా గంటా అరెస్ట్ ఖాయమంటూ ఇటీవల సెలవిచ్చారు. ఇద్దరి మద్య రాజకీయ వైరం.. ఇలా ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైందంటూ అవంతి వర్గీయులు తెగ ముచ్చటపడతున్నారట.