రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇక్కడ హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అంటారు పెద్దలు. నిజమే.. అప్పటి వరకూ ఆత్మీయంగా మెలిగిన వారు కూడా క్షణాల్లో బద్ద శత్రువులవుతారు. నిన్నటి వరకూ ఒకర్నొకరు విమర్శించుకున్నవారు కూడా ఆలింగనం చేసుకుని.. తమను మించిన స్నేహితుల్లేరంటారు. అందుకేనేమో.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇప్పుడెందుకీ ముచ్చట అంటే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మాంచి రసకందాయంలో పడ్డాయి. ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్న వెన్నులో వణకు మొదలైంది. బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనేది పక్కనబెడితే.. జనసేనాని పవన్ ప్రకటనతో బీజేపీలో మాంచి ఊపు వచ్చింది. పవర్‌స్టార్ అభిమానులు లక్షల్లో ఉన్న హైదరాబాద్‌లో ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లపై ఇది బాగానే ప్రభావం చూపుతుంది. హైదరాబాద్‌లో సుమారు 30 డివిజన్లలో సీమాంధ్రులే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారు. అటువంటి చోట జనసేనాని పిలుపుతో అధికశాతం బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.
ఇది టీఆర్ ఎస్‌కు ఊహించని దెబ్బ. ఎందుకంటే.. 2018 ముందస్తు ఎన్నికల్లో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా హైదరాబాద్ లోని సీమాంధ్ర ఓటర్లు కులాల వారీగా మీటింగ్లు పెట్టుకుని మరీ టీఆర్ ఎస్‌కు మద్దతు ప్రకటించారు. కానీ ఆ సమయంలో సీమాంధ్రులకు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అతీగతీ లేదనే ఆరోపణలున్నాయి. అందుకే. ఈ సారి సీమాంధ్రుల ఓట్లు ఎవరికి అనే ప్రశ్నమొదలైంది. బీజేపీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ ఇమేజ్ రోజురోజుకూ పెరగటం.. దుబ్బాకలో గెలుపుతో బండి పట్ల ఆదరాభిమానాలు పెరిగాయి. దీనికి జనసేనాని మద్దతు కూడా జతకట్టడంతో గ్రేటర్‌లో సీమాంధ్రులు ఎక్కువశాతం బీజేపీ అభ్యర్థులను బలపరుస్తారనే వాదనకు బలం చేకూరింది. జనసేనాని కూడా రెండు మూడ్రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటించగలిగితే.. ఇక బీజేపీ అభ్యర్థుల ఓటమికి ఏ శక్తి ఆపబోదంటూ ప్రచారం ఉంది. కానీ.. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇటీవల చిరంజీవి, నాగార్జునలతో సమావేశమయ్యారనే గుసగుసలూ లేకపోలేదు. తమ్ముడు దూకుడుకు అన్నయ్య ద్వారా చెక్ చెప్పాలనే గులాబీ బాస్ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.