కారు ఎవరిది? దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారు? అంటించితిరి పో అది ఒంగోలు నుంచి ఎందుకు పోవలే? పోయినది పో అది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ టీడీపీ అంబాడాలు మోపవలే. ఔరా!. ఇదంతా నాడు దుర్యోధనుడిని పరాభవించేందుకు ఏర్పాటు చేసిన మయసభ లెక్కనే ఉన్నదే అన్నట్టుంది. అన్నట్టుగా ఏమిటీ.. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇదంతా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆడిన దొంగాటకమా! అనే అనుమానాలు కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉన్నాయి సుమా! తమిళనాడు సరిహద్దులో ఉన్న అరబ్బాక్కం పోలీసులకు ఎవరో ఉప్పందించారు. గంజాయితో మీవైపు ఓ కారు వస్తుంది కాచుకోమని దాని సారాంశమట. వాళ్లు ఎలర్ట్ అయ్యారు. కారును ఆపగానే.. ఇద్దరు పారిపోయారు. రూ.ఐదున్నరకోట్లు విలువైన బంగారం దొరికింది. అయితే పారిపోయిన వారిలో మంత్రి సుపుత్రుడు ఉన్నాడంటూ అరవ పేపర్లు ఘాటుగానే రాశాయట. దీంతో అవకాశం వచ్చిందని తెలియగానే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.. వైసీపీ మంత్రి బాలినేనిపై విమర్శల దాడి మొదలుపెట్టారు. దీనికి కౌంటర్‌గా బాలినేని స్పందించారు. అసలు కారుతో తనకు సంబంధం లేదన్నాడు. ఎవరో బంగారు వ్యాపారి చేసిన తప్పునకు తనను విమర్శించటాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఈ దఫా రంగంలోకి దిగారు.. బాలినేని పొంతనలేని మాటలు చెబుతున్నారంటూ చెడామడా చెండాడేశారు. నిజంగానే ఆ బంగారం బాలినేని స్నేహితుడిదేనా! అనేది తేలాలి. ఎందుకంటే.. తండ్రులు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నపుడు దందా సాగించేది.. వసూళ్లు.. ఇటువంటి అవినీతికి వారసులే పాల్పడుతుంటారు. టీడీపీ హయాంలో కోడెల, రావెల,పితాని, బోండా ఉమా తదితర నేతల బిడ్డలు సాగించిన అక్రమాల కాండ నాడు.. నేడూ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. కానీ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మొదట్లోనే ఇటువంటి అవినీతికి పాల్పడితే మంత్రిపదవులు పోతాయని హెచ్చరించారు. భవిష్యత్‌లో రాజకీయ జీవితం కూడా ఉండదంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని వ్యవహారంలో తండ్రికి తెలియకుండా కొడుకు ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానాలున్నాయి. లేకపోతే ఎవరైనా కక్షపూరితంగా బాలినేని పేరు ఇరికించి ఉండవచ్చంటూ వైసీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు.