నందమూరి వారసుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. సినిమా, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆరేళ్లుగా బాగానే కొనసాగుతున్నారు. అయితే నిన్నటి వరకూ ఏదో నందమూరి ఇంటి నుంచి ఒక నాయకుడు ఉండాలి కాబట్టి అనే ధోరణితో ఉండేవారు. పైగా హిందుపురంలో బాలయ్య పీఏ చేసిన రచ్చతో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. 2019 ఎన్నికల్లో బాలయ్య గెలుపు కష్టమే అనుకున్నారు. కానీ.. బాలకృష్ణపై ఉన్న అభిమానం.. మరోసారి నెగ్గేలా చేసింది. అయితే… సినిమాలతో బిజీగా ఉండే ఆయన ఏదో ఒకరోజు మాత్రమే తన నియోజకవర్గానికి అలా వెళ్లి ఇలా వచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక తొలిసారిగా.. రాజకీయ విమర్శలతో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. ఏపీ సీఎం జగన్ అప్పట్లో బాలయ్య అభిమాని అనే ప్రచారం ఉంది. బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగినపుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ కేసు నుంచి బాలయ్యను జగనే బయటపడేశారనే పుకార్లు కూడా వినిపిస్తుంటాయి. అటువంటి వీరాభిమాని జగన్‌ను విమర్శలతో చీల్చిచెండాడుతున్నాడు బాలయ్య. మొన్న హిందూపురం పర్యటనలో ఏపీలో రాక్షస పాలన అంటూ ఆరోపించారు. పేకాట క్లబ్బులతో పరువు తీస్తున్న కొడాలి నానిని కూడా వదల్లేదు. తమను తక్కువ అంచనా వేయవద్దంటూ ఘాటైన హెచ్చరిక చేశారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు వైసీపీ దాడులతో కకావికల మయ్యాయి. వరుస అరెస్టులు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేలా బాలయ్య మొదలుపెట్టిన కొత్త రాజకీయం తెలుగు తమ్ముళ్లలో మాంచి జోష్ నింపుతుందట.