ఏపీలో లోకల్ వార్ సైరన్ మోగింది. అయితే ఇది సజావుగా సాగుతుందా! బంతి కోర్టు వరకూ చేరుతుందా! అనే దానిపై పలు అనుమానాలున్నాయి. స్థానిక ఎన్నికల అంశం.. పది నెలలుగా కరోనా చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. కరోనా వైరస్‌ను సాకుగా చూపుతున్నా.. దాని వెనుక రాజకీయపరమైన అంశాలు దాగున్నాయనేది జగమెరిగిన సత్యం. న్యాయస్థానాల జోక్యంతో ఏపీ ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఈ నెలలోనే ఎన్నికల తంతుకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే నిన్న నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే.. ఎందుకీ తొందర అనే దానిపై మాత్రం విపక్ష, అధికార పక్షాల మధ్య భిన్నాబిప్రాయాలున్నాయి. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పై వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు. పైగా ఆయన టీడీపీ హయాంలో నియమించిన అధికారి కావటంతో వైసీపీ అనుమానాలు వైసీపీకు ఉన్నాయి. తమను దెబ్బతీసేందుకు టీడీపీ ఆదేశాలు అమలు చేస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తుంది. మార్చి నెలలో కేవలం ఒక్క కరోనా కేసు ఉన్నపుడు ఎన్నికలంటే.. బాబోయ్ అంటూ వద్దని వారించిన నిమ్మగడ్డ.. లక్షల్లో కేసులు ఉన్నపుడు ఎలా ఎన్నికలు నిర్వహిస్తారంటూ కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా రెండు సంస్థలు కూర్చుని పరస్పరం సహకరించుకోవాలనే ఆదేశాలతో తాజాగా ఎన్నికల నిర్వహణపై సమీక్షలు.. సమావేశాలు. వెనువెంటనే నిర్ణయాలు వచ్చేశాయి.
అయితే కరోనా తగ్గుముఖం పట్టినా వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సి ఉందని.. కాబట్టి.. ఇప్పుడు అధికారులు, సిబ్బంది అదే పనిలో ఉంటారంటూ ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల సంఘానికి తూచ్ చెప్పేశారు. కానీ ఇదంతా కేవలం నిమ్మగడ్డపై ఉన్న వ్యక్తిగత ద్వేషమే కారమంటున్నారు టీడీపీ నేతలు. ఏమైనా.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉంది. ఇప్పటికే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ప్రభుత్వం తలపెట్టిన ఇళ్లపట్టాల పంపిణీ,అమ్మ ఒడి పథకం వంటివి ఆగిపోయాయి. ఇది కావాలనే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగే కుట్రగా వైసీపీ భావిస్తోంది. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి కూడా పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటువంటి భిన్నమైన వాతావరణంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కేరళ స్థానిక ఎన్నికలపుడు సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం నిర్ణయానికే కట్టుబడాలనే ఆదేశించినట్టుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. కాబట్టి.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తప్పకుండా సహకరించాల్సిన పరిస్థితులు వస్తాయనేది మరో వాదన. ఏమైనా.. ఇటువంటి క్లిష్టమైన వేళ ఏపీ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్‌గా మారాయనేది మాత్రం బహిరంగ రహస్యం.