బొత్స పేరు వినగానే గుర్తొచ్చేది.. సొమ్ములు పోనాయి మరీ ఏటిచేత్తాం! వైఎస్ సీఎంగా ఉన్నపుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో వోక్స్‌వాగన్ కంపెనీ విషయంలో జరిగిన తప్పిదంపై ఆయనిచ్చిన సమాధానం. తన ప్రాంత యాసలో మాట్లాడి నిజాన్ని అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లాలో బొత్స కుటుంబానిదే హవా. ఎవ్వరూ కాదనలేని వాస్తవం. గెలుపోటములకు అతీతంగా ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. బీసీ, కాపుల్లోనూ బొత్స అంటే గౌరవం లేకపోలేదు. మూడు రాజధానుల విషయంలో కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగానే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. పనిలో పనిగా మాజీ సీఎం చంద్రబాబునాయుడును కూడా అమరావతి రాజధానిలో గట్టిగా ఇరికించేలా మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటుకు కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా మూడు రాజధానుల గురించి చెప్పిందట. కానీ.. బాబుగారు మాత్రం.. కేవలం ఒకే వర్గ ప్రయోజనం కోసమే అమరావతిని ఎంపిక చేశారట. పైగా. కేంద్రం రాజధానికి ఇచ్చిన రూ.15000 కోట్లలో బాబు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం.. రూ.7500 కోట్లేనట. పైగా కేవలం రాజధాని ప్లాను కోసమే వివిధ కంపెనీలకు అడ్వాన్స్‌గా ఏకంగా రూ.350 కోట్ల వరకూ ముట్టజెప్పారట. రాజదాని పేరుచెప్పి ల్యాండ్‌పూలింగ్ కోసం 1300 కోట్లరూపాయలు వెదజల్లారట. ఇంకా.. చాలా తంతు మిగిలి ఉందని.. అవన్నీ ఒక్కోటీ వెలుగుచూపాల్సిన బాధ్యత తనపై ఉందంటున్నారు. బాబు రాజకీయాల్లో చాలా కోణాలున్నాయి. కానీ.. అమరావతి రాజధాని కోసం మరీ ఇంత తప్పు చేసి ఉంటారా! అనే అనుమానాలు తెలుగోడి మనసులోనూ ఉన్నాయి. ఏమైనా.. బొత్స సార్ చెప్పారు కాబట్టి.. ఇప్పటికిదే నిజం అనుకోవాలేమో!!