తప్పు చిన్నదైనా.. పెద్దదైనా ప్రతిఫలం ఒకేలా ఉంటుంది. తప్పు ను సమర్ధించుకోవటానికి ఎన్నో కారణాలు వెతుక్కోవచ్చు. కానీ దానితాలూకూ శిక్షలు కూడా దారుణంగానే ఉంటాయి. ఒక మహిళ.. క్షణికమైన ఆనందానికి లొంగిపోతే ఏం జరుగుతుంద నేందుకు భువనగిరిలో జరిగిన ఘటన కన్నీరు తెప్పిస్తుంది.. తొమ్మిదేళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి ఒక ఫోన్‌నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చింది. అటునుంచి మగగొంతు. అంతే మాట కలిపింది. మనసు కలిసింది. కొన్నాళ్లకు పెళ్లితో ఒకటయ్యారు. హాయిగా సాగే జీవితం.. చక్కటి సంసారం.. ఇంటికి దీపంగా కూతురు. కానీ.. ఆమె మాత్రం మరింత ఆనందాన్ని కోరుకుంది. ఫేస్‌బుక్ స్నేహితుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ లోపుగా.. అదే స్నేహితుడు పరిచయం చేసిన మరో వ్యక్తితో చెలిమి చేసింది. ఇద్దరూ ఏకాంతంలో కలుస్తూ.. ముందుగా పరిచయమైన స్నేహితుడిని దూరం పెట్టారు. ఇది జీర్ణించుకోలేని అతడు.. ఒకరోజు తాడోపేడో తేల్చుకుందామని ఆమె ఇంటికెళ్లాడు. అక్కడ పడకగదిలో ఆమె.. అతడు.. అంతే తట్టుకోలేకపోయాడు. వాడిని బయటకు పంపు అంతుచూస్తానంటూ బెదిరించాడు. ఆమె ససేమిరా అనటంతో అక్కడేఉన్న చిట్టితల్లి మెడపై కత్తిపెట్టి హెచ్చరించాడు. అయినా.. ఆమె మాత్రం తన ప్రియుడుని కాపాడుకునేందుకు మొగ్గుచూపింది. అంతే.. ఆవేశంలో ఉన్న అతడు కత్తితో చిట్టితల్లి మెడను కోడిమెడ కోసినట్టు కోశాడు. ఆ తల్లి కడుపున పుట్టిన పాపానికి.. ఆ చిన్నారి విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కల వారంతా చూశారు. పోలీసుల రంగ ప్రవేశంతో చీకటి వ్యవహారం బయటకు వచ్చింది. ఇవేమి తెలియని ఆమె భర్తకు పోలీసులు ఫోన్‌చేసి అసలు విషయం చెప్పగానే కుమిలిపోయాడు. ఇంటికొచ్చాక కన్నబిడ్డ ఇకలేదని తెలిసి తిండిమానేసి.. పిచ్చోడిగా మారిపోయాడు. అప్పటి వరకూ ప్రేమించి పెళ్లాడిన భార్యపై పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా
తారుమారు కావటంతో తట్టుకోలేకపోయాడు. గౌరవంగా బతికిన చోట.. అవమానం భరిస్తూ బతకలేనని అనుకున్నాడో.. ప్రాణంగా చూసుకునే కూతురు మరణంతో కుంగిపోయాడో .. బార్యను పుట్టింటికి పంపి.. తాను రైలుపట్టాలపై పడుకున్నాడు. బిడ్డను తలచుకుంటూ .. కూతురు చెంతకు చేరాడు. కట్టుబాట్లు.. కాలదన్ని బరితెగించి.. సంప్రదాయాలకే తూట్లు పొడుస్తున్నారు. ఆడ/మగ.. ఎవరైనా ఆనందాలను చవిచూసేందుకు వేసే తప్పటడుగులు ఇలా నిండు జీవితాలను కాలరాస్తున్నాయి.
నోట్: ఎంతైనా తాను కూడా ఒక మహిళ. బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికాడో.. మరణంలోనూ అలాగే ఉన్న అతడి పేర్లు
చెప్పటం మంచిపద్దతి కాదని రాయలేదు.