గుంటూరు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో.. ఎవరు ఎప్పుడు కిందకు పడతారో చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే.. అది గుంటూరుజిల్లా. అనుకోకుండా ఇద్దరు నేతలకు అద్భుతమైన అవకాశం దక్కింది. వారిలో ఒకరు డొక్కా మాణిక్య వర ప్రసాద్. కాంగ్రెస్‌లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయ గురువు టీడీపీలోకి రావటంతో ఆయన వచ్చేశారు. చంద్రబాబు కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఎస్సీ ఓట్ల కోసం గాలం వేశారు. చివర్లో మళ్లీ డొక్కా పార్టీ మారి వైసీపీలోకి చేరి ఎమ్మెల్సీ అయ్యాడు. ఎంత ప్రతిభ ఉందనేది కాదు.. కొంతైనా అదృష్టం ఉందా! లేదా! అనేది ఇక్కడ ముఖ్యమంటూ డొక్కా అనుచరులు తెగ ఆనంద పడుతున్నారు. మరో నేత.. మర్రి రాజశేఖర్. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. గెలుపోటముల్లో జగన్ పక్కనే ఉన్నాడు. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నించి ఓటమి చవిచూశారు. ప్రత్తిపాటి పుల్లారావుపై పై చేయి సాధించాలనే కల నెరవేరకుండా పోయింది. 2019లో అనుకోకుండా తెరమీదకు వచ్చిన విడదల రజనీ వల్ల మర్రి అసెంబ్లీ సీటు కోల్పోయాడు. కానీ.. జగన్ చిలకలూరి పేట బహిరంగ సమావేశంలో రజనీను గెలిపిస్తే మర్రిని మంత్రిని చేస్తానంటూ హామీనిచ్చారు. దానిలో భాగంగానే మొన్న గవర్నర్ కోటా కింద మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ కాగలిగారు. ఇక మిగిలింది మంత్రి పదవి చేపట్టడమే. ఎందుకంటే.. ఎలాగూ మరి కొద్ది నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీంతో మర్రి దాదాపు మంత్రి అయినట్టుగానే ఆయన అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. కానీ.. విడదల రజనీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.